టాలీవుడ్‌లో టాప్ కమెడియన్లలో సునీల్ కూడా ఒకడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట. అలా కమెడియన్‌గా పీక్‌లో ఉన్న రోజుల్లో.. అబ్బే ఇంకా ఏంటి ఈ కామెడీ.. హీరోగా ఎదిగిపోదామనే ఆశ, కోరికతో టర్న్ తీసుకున్నాడు. అయితే ఒకట్రెండు సినిమాలు ఫర్లేదు అనిపించాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రేక్‌లే ఇచ్చాయ్. దీంతో ఆయనలో ఆశ మరింత పెరగ్గా.. సునీల్ రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. అప్పట్లో ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి 3 కోట్ల వరకూ తీసుకునే వాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలన్నీ అట్టర్ ప్లాప్‌లు అవ్వడంతో ఒక్కసారిగా ఆయన రేంజ్ పడిపోయింది. దీంతో ఆయన కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
ఇలా వరుస పరిణామాలతో ఇక ‘హీరోయిజం వద్దు.. కామెడీనే ముద్దు’ అంటూ హాస్య పాత్రలకు వచ్చేశాడు. ఒకానొక సందర్భంలో సునీల్ లేనిదే ఫలానా సినిమా లేదు.. ఆయన్ను కచ్చితంగా తీసుకోవాల్సిందేనని దర్శకనిర్మాతలు పట్టుబట్టి మరీ పట్టుకొచ్చేవారు. దీంతో ఆ పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చుకున్న సునీల్.. మళ్లీ కామెడీ చేయడానికి సిద్ధమైపోయాడు. పాత్రలయితే వస్తున్నాయ్ కానీ.. ఆశించినంతగా నిర్మాతలు ఇచ్చుకోవట్లేదట. ఒకప్పుడు ఇంచు మించు చిన్నపాటి హీరోకు ఇచ్చే పారితోషికంత పుచ్చుకునే స్థాయి నుంచి ‘డే కాల్షీట్స్’కు పరిస్థితి పడిపోయిందట.
ప్రస్తుతం.. షూటింగ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు ఆయనకు నిర్మాతలు పేమెంట్స్ ఇస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు కమెడియన్స్ ఎక్కువయ్యారు.. ఒకప్పుడులా సునీల్ రేంజ్, క్రేజ్ కూడా లేదని కారణాలు చెబుతున్నారట. రోజుకు కేవలం రూ. 2 లక్షలు మాత్రమే నిర్మాతలు ఇస్తున్నారట. అయితే పరిస్థితులు అనుకూలించట్లేదు గనుక చేసేదేమీ లేక ఇచ్చినంత పుచ్చుకుని.. నోరు మెదపకుండానే వెళ్లిపోతున్నాడట. సునీల్ పరిస్థితిని చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు, తోటి మిత్రులు పాఫం.. ఎక్కడో ఉండే సునీల్.. ఇక్కడికొచ్చేశాడు.. అంటూ చెప్పుకుంటున్నారట. ఏదైతేనేం.. సునీల్ ఇదే కామెడీని కొనసాగిస్తూ.. పాత రోజులు మళ్లీ.. మళ్లీ రావాలని www.cinejosh.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.