ఇండియన్ 2 యాక్సిడెంట్: బాధితులకు రూ. కోటి పరిహారం ప్రకటించిన శంకర్
ఫిబ్రవరి 19 రాత్రి చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఇండియన్ 2 మూవీ షూటింగ్‌లో ఒక సెట్‌ను నిర్మిస్తుండగా క్రేన్ విరిగిపడి మధు, చంద్రన్, కృష్ణ అనే ముగ్గురు టెక్నీషియన్లు చనిపోయి, 12 మంది గాయాల పాలవడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి హీరో హీరోయిన్లు కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్ శంకర్ త్రుటిలో తప్పించుకున్నారు. కాగా మృతులైన ముగ్గురు టెక్నీషియన్ల కుటుంబాలకు శంకర్ రూ. కోటి పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు తాము ఎలాంటి సహాయం చేసినా, అది తమ వారిని కోల్పోయిన నష్టాన్నీ, బాధనీ పూడ్చలేనిదని ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘బాధిత కుటుంబాలకు నేను అందజేసే రూ. 1 కోటి వాళ్లకు బహుశా ఒక చిన్న సాయం మాత్రమే. రెప్పపాటులో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాననే ఆనందం కంటే, నా బృందంలో ముగ్గురు మనుషుల్ని కోల్పోయాననే బాధ నన్ను ఎక్కువగా వేధిస్తోంది’’ అని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన షాక్ నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ, అనేక భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదం జరగడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ శంకర్ అన్నారు.
కాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీ చేసింది. గురువారం సీసీబీ కమిషనర్ ఆఫీసుకు వచ్చిన ఆయనను అక్కడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి. నాగజ్యోతి విచారించారు. ఈ సందర్భంగా శంకర్ చెప్పిన విషయాల్ని ఆమె రికార్డ్ చేశారు. ఇదే తరహాలో కమల్ హాసన్‌ను కూడా సీసీబీ విచారించనున్నది.
ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత కమల్ హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భద్రతా ప్రమాణాలు సరిగా లేవని ఆరోపించారు. ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టడానికి ముందు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీసుకున్న భద్రతా చర్యలను ఆయన ప్రశ్నించారు. అనేక నిర్మాణ సంస్థలు భద్రతా ప్రమాణాలను సీరియస్‌గా తీసుకోవడం లేదనీ, కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించడం లేదనీ ఆయన ఆరోపించారు.