ఓకే బంగారం సినిమాతో తెలుగులో దుల్కర్ సల్మాన్ కి యూత్ ఫాలోయింగ్ వచ్చెయ్యడం, మహానటిలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో దుల్కర్ ఇక తెలుగు సినిమాల్లో నటిస్తాడు అనుకుంటే తెలుగు సినిమాలకు దూరంగా మలయాళ సినిమాలతో బిజీ అయ్యాడు. అయినప్పటికీ మలయాళంలో తాను నటించిన సినిమాలను తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి దగ్గరగానే ఉంటున్నాడు. తెలుగులో మరీ పాపులర్ కాకపోయినా పెళ్లి చూపులతో హిట్ అందుకున్న హీరోయిన్ రీతువర్మ, దుల్కర్ సల్మాన్ తో జోడి కట్టిన కనులుకనులను దోచాయంటే సినిమాని తెలుగులో కూడా డబ్ చేసారు. ఇక కనులుకనులను దోచాయంటే కథలోకి వెళితే..
సిద్దార్థ(దుల్కర్ ), కలీస్(రక్షణ్) స్నేహితులు. వీరిద్దరూ ఆన్లైన్ బిజినెస్ అంటూ.. ఫ్రాడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఖుషీగా లైఫ్ ని లీడ్ చేసేస్తుంటారు. సిద్దార్ధ్ అనాధ అయినా.. మీరా(రీతూ వర్మ) ప్రేమలో పడతాడు. ఆమె సంప్రదాయంగా మాత్రమే కాకుండా ఆమెకున్న మంచి పద్ధతులను చూసి సిద్దార్ద్ ఇష్టపడతాడు. ఓ పెద్ద మోసం చేసి బాగా డబ్బులు సంపాదించిన అనంతరం సిధార్థ, కలీస్ వాళ్ళ వాళ్ళ లవర్స్ తో గోవాకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ వీళ్ళు గోవాలో కొందరి చేతిలో మోసపోతారు. చాలా తెలివితేటలతో ఎదుటువాళ్ళని బురిడీ కొట్టించే తెలివి తేటలున్న సిద్దు, కలీస్ ఎలా.. ఎందుకు, ఎవరి చేతిలో మోసపోయారో అనేది మిగతా కథ.
ఇక దుల్కర్ సల్మాన్ అందంతోను, ఆహార్యంతోనూ, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. గౌతమ్ మీనన్ గెస్ట్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టగా దుల్కర్ స్నేహితుడు పాత్ర చేసిన రసజన్ కూడా బాగా నటించాడు. ఇక మీరాగా రీతూ వర్మ అద్భుతంగా నటించింది. దుల్కర్ తో ప్రేమ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. మిగతావారు పరిధిమేర ఆకట్టుకున్నారు.
సమీక్ష: కనులుకనులను దోచాయంటే టైటిల్ చూడగానే.. ఇదో లవ్ ఎంటర్టైనర్ అనుకొకమానరు. కానీ ఈ సినిమా ఆరంభంలో రొమాంటిక్ లవ్ స్టోరీలాగే కనబడుతుంది. కానీ ఇది చివరికి ఆసక్తికరమైన క్రైం థ్రిల్లర్ గా మారిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ మోసాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు. అసలు కథ ప్రకారం.. ఇదో క్రైమ్ థ్రిల్లర్. కానీ దర్శకుడు దీనికి రొమాంటిక్ టచ్ ఇవ్వడంతో.. సినిమాకి హిట్ టాక్ పడిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ లో గౌతమ్ మీనన్ ని చక్కగా వాడిన దర్శకుడు సెకండ్ హాఫ్ కొచ్చేసరికి ఆ పాత్రని డమ్మీ చెయ్యడం నచ్చదు. ఇక దుల్కర్, రీతూ వర్మ నటన సూపర్బ్. స్టోరీ, ట్విస్ట్ లు అదిరిపోయినా.. క్లైమాక్స్ సన్నివేశాల వలన సినిమాకి పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. హర్షవర్ధన్ నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని అద్భుతంగా ఉండబట్టి సినిమాకి హిట్ టాక్ పడింది. అదే పతాక సన్నివేశాలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి వెళ్ళేది. కాకపోతే సినిమాకి ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం వలన ఈ సినిమా ఎంత మంది ప్రేక్షకులకు చెరుతుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.