టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. ఆ మధ్య సినిమా రిలీజ్, ఫస్ట్ లుక్ గురించి నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటన చేశారంతే.. ఇంతకు మించి ఇంతవరకూ అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయ్. అయితే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రంగంలోకి దిగిపోయాడు. రోజుకో అప్డేట్ అంటూ హడావుడి చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయాడు.
మొన్న అలా.. నిన్న ఇలా..!
ఇప్పటికే ‘ఏ వ్యక్తి చిత్రానికైతే స్వరాలు సమకూర్చాలని కలలు కన్నానో.. ఇప్పుడాయన కోసమే పాటలు సిద్ధం చేస్తున్నా..’ అని ట్వీట్ చేసి మెగాభిమానుల మెప్పు పొందిన థమన్ తాజాగా పవన్ వీరాభిమనుల గుండెల్లో స్థానం సంపాదించున్నాడు. అదెలాగంటే.. థమన్ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ను మార్చి పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టుకున్నాడు. అంతేకాదు.. అసలు తాను ఎందుకు పవన్ ఫొటో పెట్టుకున్నాడనేదానిపై వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ‘లవ్ యూ ఆల్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది’ అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా #PSPK26FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేశాడు థమన్. అయితే ఈ ట్యాగ్‌ను మెగాభిమానులు పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీంతో మొదట ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తిగా థమన్ స్థానం దక్కించుకున్నాడు. అంటే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఇలా ట్రెండ్ సెట్టర్‌గా మారిన థమన్ రోజుకో అప్డేట్ ఇస్తూ పవన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడన్న మాట. సో.. ఈ లెక్కన చూస్తే సినిమా అప్డేట్ రాలేదని అసంతృప్తిలో ఉన్న మెగాభిమానులు ఆ మూడ్ నుంచి బయటికొచ్చేస్తారన్న మాట.