మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనేసిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ ‘లూసిఫర్’ మూవీ భారీ విజయం దక్కించుకుంది. వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి కోసం చెర్రీ హక్కులు కొన్నాడు. అయితే.. కొరటాల శివ సినిమా కంటే ముందుగానే రీమేక్ చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్యకారణాల వల్ల అది వాయిదా పడింది. కొరటాల మూవీ తర్వాత పక్కాగా ఇది ఉంటుందని.. ఇప్పటికే డైరెక్టర్లను వెతికే పనిలో చెర్రీ బిజీగా ఉన్నాడు.
అయితే ఇప్పటికే కుర్ర డైరెక్టర్ పరుశురామ్ మొదలుకుని మెగా దర్శకుడు సురేందర్ రెడ్డి, సుకుమార్ వరకు చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయ్. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది. బన్నీ సినిమాతో సుకుమార్ బిజిబిజీగా ఉండటం.. మరోవైపు రీమేక్ కాకుండా చిరు కోసం ఆయన మంచి కథను సిద్ధం చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మరో డైరెక్టర్‌ను వెతగ్గా ఆ వెతుకులాట వి.వి వినాయక్ దగ్గర వచ్చి ఆగిందట. ఆయనే ఈ రీమేక్‌ను తెరకెక్కించే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ‘శీనయ్య’ సినిమాతో హీరోగా రావాలనుకున్న ఆయన కలలు అన్నీ కల్లలయ్యాయి. దీంతో ఆ రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నాడట.
ఇప్పుడు ఏ పనీ లేకపోవడంతో తీరిగ్గా కూర్చున్న వినాయ్.. కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయట. కాగా.. మోహన్ లాల్ పాత్రలో చిరు నటిస్తాడు సరే.. పృథ్వీరాజ్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తాడా..? లేకుంటే పవన్ కల్యాణ్ నటిస్తాడా..? వీరిద్దరూ కాకుండా సాయిధరమ్ తేజ్ లేదా వరుణ్ తేజ్ నటిస్తాడో తెలియాల్సి ఉంది. సినిమాకు ఏ మేరకు రీమేక్ అవుతుందో తెలియట్లేదు కానీ పుకార్లు మాత్రం గట్టిగానే షికార్లు చేస్తున్నాయ్.