యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా రానుండగా.. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే సినిమా ప్రకటన చేసిన మరు క్షణం నుంచి అసలు ఎలా ఉండబోతోంది..? స్టోరీ ఎలా ఉండబోతోంది..? ఇంతకీ నాగి కథలో డార్లింగ్‌కు ఏం నచ్చింది..? ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానా.. లేకుంటే లవ్ రిలేటెడా..? చిన్నా చితకా సినిమాలకు అస్సలు ఒప్పని ప్రభాస్‌ను నాగీ ఎలా ఒప్పించగలిగాడనేది ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యిందట.
ఈ క్రమంలో సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమా మొత్తం ‘సైన్స్ ఫిక్షన్’ నేపథ్యంలో కొనసాగన్నదే ఆ వార్త సారాంశం. అంతేకాదు.. ఇందులో ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తాడని.. సూపర్ నేచురల్ పవర్స్ వుండే హీరోలా పాత్ర ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్క మాటలో చెప్పాలంటే డార్లింగ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం ‘క్రిష్’ చిత్రంలో హృతిక్ రోషన్‌లా ఉంటుందట. అంటే.. ఇప్పుడు ప్రభాస్ కూడా బాలీవుడ్ హీరోలతో పోటీ పడిన ‘బాహుబలి’ లో మాదిరిగా కండలు పెంచాలన్న మాట.
మరీ ముఖ్యంగా.. సైన్స్ ఫిక్షన్‌లో సినిమా చేయాలని అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ తన మనసులోని మాటను చెప్పాడు. ‘మహానటి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ మాటను నాగీ బయటపెట్టాడు. అయితే నాటి నుంచి అదే పనిలో ఆయన ఉన్నారట. మొదట నాగీనే స్వయంగా వెళ్లి ప్రభాస్‌ను కలిసి కథ చెప్పగా ఒప్పుకోలేదట. అయితే నాగీ మామ, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రంగంలోకి దిగగా అన్నీ సెట్ అయిపోయాయట. మరి కథ ఎలా ఉంటుందో..? ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చుతుందో ఏంటో!