ప్రస్తుతం తెలుగులో చాలా రీమేక్స్ రెడీ అవుతున్నాయి. పర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలని తెలుగు ప్రేక్షకుల కోసం మన భాషలో మన నటులతో, మన నేటివిటీతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో హిట్ అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. ఎంత రీమేక్ అయినా దర్శకుడు ఆ సినిమాని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీస్తేనే ఆ సినిమా వర్కవుట్ అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ మొదలుకుని, వెంకటేష్ నారప్ప, రామ్ రెడ్, ఇంకా నితిన్ అంధాధున్ తో సహా దాదాపు ఆరేడు రీమేక్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అయితే ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం. రీమేక్ సినిమా కాబట్టి డైరెక్ట్ గా ఒరిజినల్ సినిమాలో ఎలా ఉందో అలానే తీసేస్తున్నారట. ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా దించేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పింక్ సినిమా, వెంకటేష్ నారప్ప సినిమాల షూటింగ్ ఇలానే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టు దించేయడం వల్ల చాలా సమస్యలున్నాయి. రీమేక్ సినిమా అనగానే అది ఏ భాషలోదో కనుక్కుని మరీ చూసేస్తున్న సమయంలో సినిమాలో పాత్రధారులు తప్ప అసలేమీ మార్పు లేకపోతే బోరుకొట్టడం ఖాయం.
ఈ విషయంలో హరీష్ శంకర్ ని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఆయన తీసే రీమేక్ లు రీమేక్ లుగా కాకుండా ఒరిజినల్ గా ఉండడానికి కారణం దానికి ఆయన చేసే మార్పులే. ఎవరెంత కాదన్నా హరీష్ సినిమాలు రీమేక్ అని తెలిసినా చూడాలనిపించడానికి కారణం ఆయన చేసేటువంటి మార్పులే ప్రధాన కారణం..అందుకే కాపీ పేస్ట్ బదులు కొత్తదనం ఉంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.