ప్రస్తుతం రాజకీయాలతో పాటుగా సినిమాల మీద సినిమాలు మొదలెట్టిన పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ విషయంలో తొందరపడుతున్నాడు. మరోపక్క క్రిష్ సినిమా షూటింగ్ తోనూ పరుగులు పెడుతున్న పవన్ కళ్యాణ్ సినిమా విషయాలేమి ప్రస్తుతం సోషల్ మీడియాకి అందడం లేదు. పింక్ విషయాలేమి పవన్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోకపోయినా.. పింక్ రీమేక్ ముచ్చట్లు బయటికి రాగానే కాస్త హడావిడి అయితే కనబడుతుంది. కానీ క్రిష్ అప్ డేట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. తాజాగా పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కోర్టులో వాదించే సన్నివేశాలు... టెంపర్ లో ఎన్టీఆర్ కోర్టు సన్నివేశాలను తలదన్నే రీతిలో ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కోర్టు సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కోర్టు సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ తో తలపడనున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా సన్నివేశాలతోనే నడుస్తుందని.. ఈ సన్నివేశాల్లో నటుడు ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ వాదిస్తాడని, ప్రకాష్ రాజ్ పవన్ కి ఆపోజిట్ లాయర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ప్రకాష్ రాజ్ - పవన్ మధ్యన వాదోప వాదనలు ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కోర్టు సన్నివేశాల చిత్రీకరణే దర్శకుడు వేణు శ్రీరామ్ చేపట్టాడని అంటున్నారు. మార్చి నెలాఖరున ఉగాది కానుకగా పవన్ పింక్ రీమేక్ టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ వదుల్తారని సమాచారం. మరి పవన్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ అంటూ పెద్ద ఎత్తునైతే ప్రచారం జరుగుతుంది.