వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోల జాబితాలో యంగ్ హీరో శర్వానంద్ కూడా చేరిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జాను’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో డీలా పడిపోయాడు. ఇది అతనికి హ్యాట్రిక్ ఫ్లాప్ కావడం గమనార్హం. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ‘పడి పడి లేచె మనసు’, ‘రణరంగం’ కూడా ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాయి. మంచి కాన్సెప్టులతో సినిమాలు చేస్తాడనే పేరు సంపాదించుకొని, నిన్నటి దాకా మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న శర్వానంద్‌కు ఇప్పటి స్థితి ఇబ్బందికరమే.
ఈ ఎఫెక్ట్ అతని తర్వాతి సినిమా ‘శ్రీకారం’పై గట్టిగానే పడిందని ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. పేరుపొందిన ప్రొడక్షన్ కంపెనీ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో కిషోర్ బి. డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ లాంటి హిట్ సినిమా తర్వాత ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాకి ట్రేడ్ వర్గాల్లో ఎలాంటి గిరాకీ ఉండాలి! కానీ అలాంటి గిరాకీ ఏమీ ‘శ్రీకారం’కు కనిపించడం లేదు. అనేక రంగాల వాళ్లు తమ పిల్లలను అవే రంగాల్లో తమ వారసులుగా తీర్చిదిద్దుతున్నప్పుడు ఒక రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు, వ్యవసాయం ద్వారా ఎందుకు ఆదాయాన్ని పొందకూడదనే కథాంశంతో తయారవుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట సంకల్పించారు.
ఈ సినిమా ఆకర్షణల్లో సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, మిక్కీ జె. మేయర్ సంగీతం, జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఉన్నాయి. అలాగే ప్రేక్షకుల అభిమాన నటులు రావు రమేష్, మురళీ శర్మ కూడా ఉన్నారు. ఎటు తిరిగీ శర్వానంద్ ఉన్నాడాయె. ఇన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ బిజినెస్ వర్గాల్లో ‘శ్రీకారం’కు క్రేజ్ రాలేదు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలో నిర్మాతల అంచనాలకూ, వస్తున్న ఆఫర్లకూ పొంతన ఉండటం లేదు. చాలా తక్కువ ధరలకు ఆ హక్కులను అడుగుతున్నారని సమాచారం. శర్వానంద్ హీరో అంటే బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుందని ఊహించుకున్న నిర్మాతలు ఇప్పుడు అయోమయంలో పడిపోయారని వినిపిస్తోంది. ప్రస్తుతం శర్వా ట్రాక్ రికార్డ్ బాగా లేనందువల్లే ఈ స్థితి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.