టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా అంటే డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తర్వాత కుర్ర హీరోలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ మూవీ అందించిన వంశీ పైడిపల్లి రెడీగా ఉండగా.. కథ విషయం కాస్త తేడా కొట్టడంతో దాన్ని సరిచేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. అయితే.. ఈ గ్యాప్‌లో ‘గీత గోవిందం’ సినిమాతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన పరుశురామ్ లైన్‌లోకి వచ్చాడని టాక్ నడిచింది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. తాజాగా మరో కుర్ర డైరెక్టర్ రంగంలోకి దిగారని.. అంతేకాదు కథ కూడా వినిపించారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? కథ వినిపించిన విషయంలో నిజమెంత..? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆ కుర్ర డైరెక్టర్ మరెవరో కాదండోయ్.. ‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ లాంటి మంచి కథలను టాలీవుడ్‌కు అందించిన ప్రవీణ్ సత్తారు. అదేదో సామెత ఉంది కదా అలాగా.. వంశీ పైడిపల్లి, పరుశురామ్ ‘నువ్వా నేనా..’ అనుకుంటున్న టైమ్‌లో సరిగ్గా రంగంలోకి దిగిన ప్రవీణ్.. కథ వినిపించాడట. 80% కథ విన్న మహేశ్.. కొత్త పంథాలో ఉండటంతో ఓకే అన్నాడని టాక్ నడుస్తోంది. అయితే కథ ఇంకాస్త బ్యాలెన్సింగ్‌గా ఉండేలా చూడాలని ఆ కుర్ర డైరెక్టర్‌కు మహేశ్ సూచించారట. మరి ఇందులో నిజం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మహేశ్ వరుసగా మూడు సినిమాలతో బిజిబిజీగా గడుపుతాడన్న మాట. మరి షికార్లు చేస్తున్న ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఏంటో..!