టాలీవుడ్‌లో ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా వ్యత్యాసం ఉందన్న విషయం తెలిసిందే. అప్పుడు ముద్దు సీన్స్ అంటే పెద్ద గగనమే.. ఇప్పుడు సినిమాల్లో మాత్రం అరగంటకో లిప్ లాక్.. ఐదు నిమిషాలకో హగ్.. ఇదీ పరిస్థితి. ఈ తరుణంలో ఓ సీనియర్ నటుడు తన అసంతృప్తిని.. ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అసలు ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు..? కనీసం ఆ ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు..? అంటూ దర్శకనిర్మాతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు..? ఎందుకిలా మాట్లాడేశారన్న విషయాలు తెలుసుకుందాం.
ఏదో ఒకటి చేయొచ్చుగా!
‘శంకరాభరణం’ సినిమా వచ్చి 40 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల గ్రాండ్‌గా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ఆసక్తికర.. ఆలోచించదగ్గ విషయాలను మాట్లాడారు. ఆయన మాటలకు స్టేజ్ పైనున్న పెద్దలు.. కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులు, సీనియర్లు ఆలోచనలో పడ్డారు. ‘ప్రస్తుతం మొదటి స్థానంలో హిందీ.. తర్వవాత స్థానంలో మనం ఉన్నాం. బహుశా బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు మనం హిందీని కూడా దాటిపోయాం అనుకుంటా. చిత్ర పరిశ్రమ ఇంతగా ఎదుగుతున్నప్పుడు శంకరాభరణం లాంటి సినిమాను ఎవరూ ఎందుకు తీయలేకపోయారు..? మళ్లీ విశ్వనాథ్ గారే తీయాలా?. చిత్ర పరిశ్రమ ఇంతగా విస్తరించాక అలాంటి ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఎందుకు తీయడంలేదు. శంకరాభరణం సినిమాలోని ఓ సన్నివేశం కానీ.. పాట కానీ పెట్టి సినిమా తీయకపోతే మేం సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వం అని కానీ.. లేదా పిల్లలకు చెప్పే పాఠాల్లో శంకరాభరణం సినిమాలోని ఏదో ఒక అంశాన్ని పెట్టొచ్చు కదా? అది కూడా కుదరకపోతే.. విశ్వనాథ్‌గారి పేరుతో ఇన్‌స్టిట్యూషన్ ఓపెన్ చేయొచ్చు కదా?’ అని స్టేజ్‌పైన మాట్లాడుతూ ఒకింత ఊగిపోయారు.
ప్లీజ్ ఆలోచించండి!
అంతటితో ఆగని ఆయన.. ఈ నలభై ఏళ్లలో ఏ ఒక్క దర్శకుడు కానీ నిర్మాత కానీ ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు తీయలేదంటే.. మరో నలభై ఏళ్ల తర్వాత ఎవరు తీస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంతసేపూ మన బతుకులు లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న సినిమాలు చూడటమేనా?.. మన బతుకులు మారవా..? అని ఆయన ప్రశ్నించారు. ప్లీజ్.. ‘శంకరాభరణం’లాంటి సినిమాలు తీయండి.. అలాంటి తీస్తే మన భారతీయ సినీ స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అని తన ప్రసంగం చివర్లో ఎల్బీ శ్రీరామ్.. దర్శకులను వేడుకున్నారు.
కాగా.. అప్పుడు జనరేషన్ వేరు.. ఇప్పుడు జనరేషన్ చాలా వేరు. అప్పట్లో తీసిన సినిమాలు ఈ తరం కనీసం యూ ట్యూబ్‌లో చూడటానికి కూడా సాహసం చేయరన్నది జగమెరిగిన సత్యమే.. అలాంటిది ఇక సినిమా థియేటర్లకెళ్లి చూస్తారనుకుంటే అది మన అమాయకత్వమే అనుకోవాలి. ఏ జనరేషన్‌కు తగ్గ సినిమాలు అప్పుడే నడుస్తాయ్.. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నడవవ్.. మరి ఎల్బీ శ్రీరామ్ మాటలను సీరియస్‌గా తీసుకొని ఎవరైనా దర్శకులు భగీరథ ప్రయత్నం చేస్తారేమో చూడాలి..!