రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పూరికి ఆ సినిమాతో హిట్ రాగా, రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ వచ్చింది. ‘మెమరీ ట్రాన్స్ఫర్మేషన్’ అనే పాయింట్ పై అల్లిన ఆ కథలో అరుణ్ అనే సిబిఐ ఆఫీసర్ మెమరీ ట్రాన్స్ఫర్ అయిన కాంట్రాక్టు కిల్లర్ శంకర్ క్యారెక్టర్ లో రామ్ ప్రదర్శించిన నటన మాస్ ఆడియన్స్ ను అమితంగా అలరించింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ను హిందీ ఆడియన్స్ కూడా బాగా లైక్ చేస్తున్నారని ఆ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ తెలియజేస్తోంది.
ఫిబ్రవరి 16 న ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను అదే పేరుతో ఆదిత్యా మ్యూజిక్ సంస్థకు చెందిన ఆదిత్యా మూవీస్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. వారం తిరిగేసరికల్లా ఆ మూవీని 57 మిలియన్ల మందికి పైగా చూడటం ఒక విశేషమైతే, 9.10 లక్షలకు పైగా లైక్స్ రావడం ఇంకా పెద్ద విశేషం. సౌత్ ఇండియాలోనే ఇంత వేగంగా ఆదరణ పొందిన డబ్బింగ్ సినిమాలు అరుదని చెప్పాలి. నార్త్ ఆడియన్స్ మాస్ మూవీస్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తెలుగులో సూపర్ హిట్టయిన క్లాస్ సినిమాలతో పోలిస్తే ఓ మాదిరిగా ఆడిన మాస్ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ ను నార్త్ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతున్నారని వాటికి వస్తున్న వ్యూస్ తెలియజేస్తున్నాయి.
అదే తరహాలో ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ వెర్షన్ సైతం నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. టైటిల్ రోల్ లో రామ్ నటన, అతని మాస్ డైలాగ్స్, ఫైట్స్, డాన్సులను వాళ్ళు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ను పూరి జగన్నాథ్ తీర్చిదిద్దిన విధానం, జెట్ స్పీడ్ తో పరిగెత్తే కథకు వాళ్ళు ఫిదా అవుతున్నారు. పైగా డబల్ డోస్ అన్నట్లు ఇద్దరు హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ ను ఒలకబోయడం వాళ్ళను ఆకట్టుకుంటోంది.