బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ చరణ్ లు హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి అనేక లీకేజీలు బయటకి వచ్చాయి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ పులితో ఫైటింగ్ చేసే సీన్స్ లీక్ అయ్యాయని వార్తలు వచ్చాయి. అలాగే సీతారామరాజు రామ్ చరణ్ లుక్ తో పాటు ప్రతినాయక పాత్రల్లో కనిపిస్తున్న హాలీవుడ్ తారల లుక్ కూడా లీక్ అయిందని వార్తలు వచ్చాయి. ఈ లీకులని అరికట్టడానికి సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా కూడా ఏదో విధంగా ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన చిత్రాలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి.
లీకులు అరికట్టడానికే శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే తాజాగా ఓ కొత్త సమస్య వచ్చి పడింది. ఆర్ ఆర్ ఆర్ కి ఎంత మంది దర్శకులని అడిగితే...అదేంటి రాజమౌళి ఒక్కడే కదా అని అనేస్తారు. కానీ గూగుల్ మాత్రం ఇద్దరు దర్శకులు ఉన్నారని చెప్తుంది. అవును..ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి గూగుల్ లో కొడితే రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే మరో వ్యక్తి పేరును కూడా సూచిస్తుండడం అందరికీ షాక్ కి గురిచేసింది. అయితే ఇదంతా ఎలా జరిగిందని ఆరాతీస్తే వికీపీడియాలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఇలా మరొకరి పేరుని సూచిస్తుందని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాల విషయంలోనే ఈ విధంగా ఉంటే చిన్న సినిమాల ఇన్ఫర్మేషన్ లో ఎంత మాత్రం నిజం ఉంటుందో మరి.