Advertisementt

కోడి రామకృష్ణ .. గురువుకి తగ్గ శిష్యుడు

Sat 22nd Feb 2020 08:39 PM
kodi ramakrishna,death anniversary,director,dasari,chiranjeevi,balakrishna  కోడి రామకృష్ణ .. గురువుకి తగ్గ శిష్యుడు
Kodi Ramakrishna First Death Anniversary కోడి రామకృష్ణ .. గురువుకి తగ్గ శిష్యుడు
Advertisement
Ads by CJ

హిట్లు... కేరాఫ్ కోడి రామకృష్ణ - ఫిబ్రవరి 22 వర్ధంతి

సినిమాని కాచి వడపోసిన వారు బహు కొద్ది మందే ఉంటారు. ఆ జాబితాలో కచ్చితంగా కోడి రామకృష్ణ ఉంటారు. అందుకే ఆయన హిట్లు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. చిరంజీవితో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి అనేక హిట్ సినిమాలతో గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.

కోడి రామకృష్ణ. ఆయన పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేశారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథా నాయకులందరితో ఆయన సినిమాలు చేశారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించారు. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రలేఖనం వృత్తినీ చేపట్టారు. పగలు చదువుకోవడంతోపాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్స్ షాపును రాత్రిళ్ళు నిర్వహించేవారు. ఆయన చిత్రాలు గురువు నాగేశ్వరరావుతో ఫొటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి - ‘‘మన వంశంలో డిగ్రీ వరకూ చదువుకున్న వారే లేరు. నువ్వు డిగ్రీ పూర్తిచేస్తే చూడాలనివుంది. డిగ్రీ చదివాకా నీకేది చెయ్యాలని తోస్తే ఆ పనే చేసుకో’’ అని కోరారు. దాంతో అప్పటి నుంచీ సినిమా ప్రయత్నాలు మానుకుని డిగ్రీ పూర్తిచేశారు.

నాటకరంగంలో తొలి అడుగు

పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలితకళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుంచీ రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తివుండేది. అత్యంత చిన్నవయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాల్లో ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచీ చదువుతో పాటు నాటకాలు ఆడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టిక్కెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించేవారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మ్యానరిజాలు ఉన్నవారిని ఎన్నుకుని అందుకుతగ్గ పాత్రలు సృష్టించి వారితో నటింపజేసేవారు. రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతిచోటకూ అభిమానంగా రామకృష్ణను కూడా తీసుకువెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణతో సుడిగుండాలు సినిమాలోని కోర్టుసీనులో అక్కినేని నాగేశ్వరరావు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే ఏకపాత్రను ప్రదర్శించేవారు.

సినిమా రంగంలోకి తొలి అడుగు

దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. ఆ సినిమా అర్థశతదినోత్సవం పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేసుకున్నారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులూ పాల్గొనడంతో, కార్యక్రమం ముగిశాకా ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరఫున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రాం రావడంతో, ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులంతా ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బయలుదేరారు.

దాసరి నారాయణరావు ఒకేసారి రెండు, మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తూండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకుణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకు అనుగుణంగా దాసరి-రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు.

దర్శకునిగా...

కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం ‘‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’’(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే.

చిరంజీవితో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయశిఖరం(అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా), సింహపురిసింహం(చిరంజీవి ద్విపాత్రాభినయం), గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం ‘మంగమ్మగారి మనవడు’ ఈయన చిత్రమే. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువభాగం కోడి దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంతో కొంతకాలం చిత్రాలు తీశారు. తర్వాత అమ్మోరు(సినిమా) సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని చిత్రాలు తీశారు (దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి). రాజకీయ నేపథ్యంతో కొన్ని చిత్రాలు తీసారు. ఈయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించింది.

నటునిగా....

రామకృష్ణ మొట్టమొదట దర్శకునిగా కాక సినీనటునిగానే చేద్దామని ప్రయత్నించారు. డిగ్రీ పూర్తికాకుండానే పలు సినిమా దర్శకులకు తన ఫోటోలు పంపేవారు. అయితే తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడు కావాలన్న ఆలోచన బలపడింది. కానీ తొలి నుంచీ నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మ పెళ్లి అన్న సినిమాలో దాసరి నారాయణరావు ఆయనకు కథానాయికకు అసిస్టెంటుగా ఓ పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్ తో జరుగుతూండగా అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. రాజశ్రీ దర్శకత్వంలో, రాఘవ నిర్మాతగా తీస్తున్న చదువు సంస్కారం సినిమాలో ఓ విద్యార్థి నాయకుని పాత్ర ఉంటే అందుకు రామకృష్ణను విద్యార్థి నాయకునిగా పాలకొల్లులో చూసిన రాఘవ ఆయనతోనే నటింపజేశారు.

అలా మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకుని నటించినట్టు అయింది. దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రం విజయవంతం కాలేదు. తర్వాత కొద్ది సినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు.

అవార్డులు - రివార్డులు

పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి. ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు.

Kodi Ramakrishna First Death Anniversary:

Special Aritical About Kodi Ramakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ