తమిళ నటుడు ధనుష్ వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎక్స్ పర్ట్.. కానీ ఎన్ని విలక్షణమైన సినిమాలు చేసినా ధనుష్ కి పాపులారిటీ వచ్చింది మాత్రం మాస్ సినిమాలతోనే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే ధనుష్ ఈ సారి ఒక క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు. పిజ్జా, జిగర్తాండా వంటి విభిన్న చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ధనుష్ ౪౦ వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.
తమిళంలో సూపర్ స్టార్ అయినా కూడా ధనుష్ కి తెలుగులో ఉన్న మార్కెట్ చాలా తక్కువ. రఘువరన్ బీటెక్ సినిమా ఒక్కటే తెలుగులో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినప్పటికీ వాటికి పెద్దగా పేరు రాలేదు. అందువల్ల గత కొన్ని రోజులుగా ధనుష్ సినిమాలు తెలుగులో విడుదల కావడం లేదు కూడా. అయితే ఈ సారి ఆ పద్దతిని మార్చి తెలుగులోనూ వస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న జగమే మంత్రం సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారట.
ఈ సినిమాతో తెలుగులోనూ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో కూడా నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 , యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా రిలీజే చేస్తున్నాయి.