జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు, రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్నాడు. అయితే నటనలోనే కాకుండా బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు ఉన్న ఎన్టీఆర్ అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటాడు. ఆ పాటలు సూపర్ హిట్ అయిన సందర్భాలు అనేకం. మొదటిసారిగా యమదొంగ సినిమాలో ఓలమ్మీ తిక్కరేగిందా అనే పాటని పాడాడు.
ఆ తర్వాత ఆ అలావాటుని కొనసాగిస్తూ వచ్చాడు. అదుర్స్ సినిమాలో చారి అనే పాటగానీ, రభస సినిమాలో రాకాసి రాకాసి అంటూ పాడిన పాట, అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో ఐ వానా ఫాలో ఫాలో అంటూ పాడిన పాటలు జనాల్లోకి బాగా వెళ్లాయి. సాధారణంగా తాము హీరోలుగా నటించే సినిమాల్లోనే పాటలు పాడుతుంటారు. కానీ తన సినిమాకి కాకుండా వేరే హీరో సినిమాలకి కూడా పాటలు పాడటం ఎన్టీఆర్ కే చెల్లింది.
పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ సినిమా కోసం గెలయా గెలయా అంటూ తన గొంతు సవరించుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు మరోసారి మరో హీరో కోసం ఎన్టిఆర్ పాట పాడబోతున్నాడని సమాచారం. తమిళ స్టార్ దళపతి విజయ్ సినిమా మాస్టర్ కోసం తన గొంతు విప్పబోతున్నాడట. ఈ సినిమా సంగీత దర్శకుడయిన అనిరుధ్ ఎన్టీఆర్ తో పాడించాలని చూస్తున్నాడట. మాస్టర్ సినిమాలోని కుట్టీ స్టోరీ అనే పాటని తెలుగులో ఎన్టీఆర్ తో పాడించాలని చూస్తున్నారు.
మరి ఈ పాట పాడడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియదు. అయితే ఈ పాట పాడడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడనే భావిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడ విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడితే సినిమాకి తెలుగులో హైప్ వచ్చేసినట్టే....