మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో సినిమా షూటింగ్ మాత్రం గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించనున్నాడని.. ఆయన యంగ్ చిరుగా కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. నక్సలైట్‌గా చెర్రీ కనిపిస్తాడని.. తెరపై చరణ్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ పాత్ర మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని కూడా టాక్ నడిచింది. సినిమా హైలెట్స్‌లో ఇది కూడా ఒకటని ఇలా రకరకాలుగా వార్తలు వెలువడ్డాయ్.
ఇవన్నీ అటుంచితే.. భారీ బడ్జెట్ సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీ నటిస్తుండటంతో ఆయనకు వీలుకాదని ఆయన స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను తీసుకున్నారని.. బన్నీ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడని.. ‘చెర్రీ ఔట్.. బన్నీ ఫిక్స్’ అంటూ వార్తలొచ్చేశాయ్. అయితే తాజాగా అబ్బే బన్నీ కూడా కాదని.. ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబునే రంగంలోకి దింపారని టాక్ నడుస్తోంది.
చెర్రీకి అనుకున్న పాత్రలో మహేశ్ పోషించబోతున్నాడన్నదే ఆ టాక్ సారాంశం. ఈ సినిమాకు చెర్రీ నిర్మాతగా పరిమితం కానున్నారని.. ఆయన స్థానంలో మహేశ్‌ను రెఫర్ చేశాడని తెలుస్తోంది. తనకంటే మహేశే ఆ పాత్రకు న్యాయం చేయగలడని తాను నమ్ముతున్నానని.. తప్పకుండా తీసుకోవాల్సిందేనని చెర్రీ పట్టుబట్టాడట. అంతేకాదు చెర్రీనే సూపర్‌స్టార్ దగ్గరికెళ్లి మరీ ఒప్పించాడట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇటు మెగాభిమానులు.. అటు ఘట్టమనేని అభిమానులకు పండగే అన్న మాట.