సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నటించమంటే జీవించేస్తుందంతే. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మొదట ఈ బ్యూటీనే సంప్రదిస్తుంటారు. రీల్ వరకూ ఓకే గానీ రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా సెటిల్ అవుదామనుకున్నా అవ్వట్లేదు.. అది వర్కవుట్ అవ్వట్లేదు. రియల్ లైఫ్‌లో ఏం వర్కవుట్ అవ్వట్లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.
నయన్‌కు రియల్ లైఫ్‌లో ఊహించని షాక్ తగలనుందని గత 24 గంటలుగా ఇటు సోషల్ మీడియాలో.. అటు వెబ్ సైట్లలో ప్రధానంగా వార్తలు వినపడుతున్నాయి. నయన్‌పై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో రగలిపోతున్న నిర్మాతల మండలి నుంచి ఆమెకు ఈ షాకింగ్ వార్త రానుందట. వాస్తవానికి ఈ భామ గట్టిగానే పుచ్చుకుంటోంది. సుమారు 6 కోట్ల రూపాయిలకు పైగానే ముట్టుతోందట. అయితే.. ఆమె అడిగినంత పారితోషికం ఇస్తున్నప్పటికీ ఆమె షూటింగ్‌కు వచ్చిన ప్రతిరోజూ సుమారు లక్ష రూపాయిలు దాకా అవుతోందట. ముఖ్యంగా క్యారవాన్, అసిస్టెంట్స్, బౌన్సర్లు, బాడీగార్డ్‌లు, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కారు, కారు డ్రైవర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయట. ఇలా వీటన్నింటికీ రోజుకు 60 నుంచి లక్ష రూపాయిల వరకూ అవుతోందట.
ఇవన్నీ ఓ లెక్క అయితే షూటింగ్ స్పాట్‌కు ప్రియుడు వచ్చినా ఆయన కోసం రూమ్ కూడా సదరు సినిమా నిర్మాతే భరించాలట. దీంతో నిర్మాతలకు తడిసి మోపెడవుతోందట. ఇలా నయన్‌ను భరించడం వల్ల కాదని ఆమెతో సినిమా చేసిన.. చేయాలనుకుంటున్న నిర్మాతలు.. నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారట. నిర్మాతల మండలి సభ్యులతో నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట. కొందరు నిర్మాతలు అయితే ఆమెపై ఇంకా లేనిపోని మాటలు కూడా చెప్పారట. క్యారవాన్‌తో పాటు ఇతర ఖర్చులన్నీ పారితోషికంలోనే అనే నిబంధన పెట్టాలని నిర్మాతల మండలి నుంచి ఓ ప్రకటన రానుందట. ఇదే జరిగితే ఇక మొత్తం అన్ని ఖర్చులు పారితోషికంలోనే అన్న మాట. నిజంగా నిర్మాతల మండలి నుంచి ప్రకటన వస్తే.. నయన్‌కు ఊహించని షాక్.. నిర్మాతలకు గుడ్ న్యూస్ అన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే రియాక్ట్ అవ్వాల్సిందే మరి.