బాహుబలి సినిమాతో ఇండియన్ తెర మీద అప్పటి వరకు చూడని దృశ్యకావ్యాన్ని మనకి చూపించిన రాజమౌళి..ఆ సినిమాతో మరో కొత్త భాషని కూడా పరిచయం చేశాడు. తన సినిమాల్లో విలన్లని ఎంతో పటిష్టంగా, బలవంతులుగా చూపించే రాజమౌళి బాహుబలి సినిమాలో కాలకేయులకి కొత్త భాషని కనిపెట్టాడు. కాలకేయులతో చేసే యుద్ధం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో..వారు మాట్లాడే భాష కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కాలకేయులకి సరికొత్త భాష కావాలని అడగ్గా తమిళ రచయిత మదన్ కార్కీ ఓ కొత్త భాషనే కనిపెట్టాడు.
ఈ భాషకి కిలికి అనే నామకరణం కూడా చేశారు. అయితే బాహుబలి సినిమాతోనే ఈ భాషకి అంతం అయిపోలేదు. కిలికి భాషని జనాల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు మదన్ కార్కీ. తాను సృష్టించిన భాషకి వచ్చిన పాపులారిటీనీ ఉపయొగించుకుని కిలికి భాషని అభివృద్ది చేశాడు. ఇప్పుడు ఈ భాష కోసం సెపెరేట్ గా వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేస్తున్నారట. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున ఈ వెబ్ సైట్ ని రాజమౌళి చేత లాంచ్ చేయిస్తున్నారట.
ఒక సినిమాలో మాట్లాడిన భాషకి వెబ్ సైట్ లాంచ్ చేయడం అంటే ఆ సినిమా ద్వారా ఆ భాష ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అంతా ఒకే కానీ ఈ భాషని ఎంత మంది నేర్చుకుంటారనేదే సందేహం.