టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్, టీజర్‌లు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా.. ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఊహించని విధంగా సినిమా రిలీజ్‌కు బీజేపీ బ్రేకులు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే.. ‘భీష్మ’ అనే టైటిల్ పెట్టి చిత్ర విచిత్రాలుగా తెరకెక్కించడంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది..?. మహాభారతంలో భీష్ముడి పేరుని సినిమా టైటిల్‌గా పెట్టి ఇష్టానుసారం తెరకెక్కించేస్తారా..? ఇలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని బీజేపీ ధార్మిక సెల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తోంది. వెంటనే టైటిల్ మార్చాలని లేని పక్షంలో సినిమా రిలీజ్ కానివ్వమని సదరు ధార్మిక సెల్ అధ్యక్షులు ఓ ప్రకటనలో తెలిపారు.
అంతేకాదు.. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరుని లవర్‌బాయ్ పాత్రకు పెట్టడం విడ్డూరం ఉందని.. అసలు ఇది ఎంతవరకు సబబు డైరెక్టర్ గారూ..? అంటూ ధార్మిక సెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. టైటిల్ మార్చాలని లేని పక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు, సెన్సార్ బోర్డుని సైతం ఆశ్రయిస్తామని సభ్యులు చెబుతున్నారు. బీజేపీ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా.. ఇలా సినిమా రిలీజ్‌కు అతి కొద్దిరోజులే ఉన్న సమయంలో ఇలా పలు సినిమాలకు బ్రేకులు పడటం.. ఆ తర్వాత చేసేదేమీ లేక సినిమా పేర్లు మార్చుకుని రిలీజ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. మరి ‘భీష్మ’ ఇంతవరకూ ఈ వ్యవహారంపై స్పందించలేదు.. మరీ తాజా బ్రేకులతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో..!