అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ‘హలో బ్రదర్’ (1994) మూవీ ఎంతటి బ్లాక్‌బస్టర్ అయ్యిందో మనలో చాలామందికి తెలుసు. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. ఇవాళ ఆ సినిమాను క్లాసిక్ ఎంటర్‌టైనర్‌గా విమర్శకులు పరిగణిస్తున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘జుడ్వా’ (1997) పేరుతో రీమేక్ అయిన ఆ మూవీ అక్కడా సూపర్ హిట్టయ్యింది. దాన్ని వరుణ్ ధావన్ ‘జుడ్వా 2’ (2017) పేరుతో రీమేక్ చేసి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. హిందీలోనే రెండు సార్లు ఆ సినిమా హిట్టయినందున తెలుగులోనూ దాన్ని రీమేక్ చేస్తే తప్పకుండా హిట్టవుతుందని ‘హలో బ్రదర్’ మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. చాలా కాలంగా ఆ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నా రీమేక్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒరిజినల్‌ను నాగార్జున చేశారు కాబట్టి, రీమేక్‌లో ఆయన తనయుడు నాగచైతన్య చేస్తే బాగుంటుందనేది అక్కినేని ఫ్యాన్స్ ఆభిప్రాయం. అయితే ఇదివరకు ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా ‘హలో బ్రదర్’ క్లాసిక్ అనీ, దాన్ని టచ్ చెయ్యకపోతేనే బాగుంటుందనీ చైతన్య చెప్పుకుంటూ వచ్చాడు. కానీ హిందీలో రెండోసారి రీమేక్ అయి సూపర్ హిట్టయ్యాక, చైతన్య తన అభిప్రాయం మార్చుకొని ‘హలో బ్రదర్’ రీమేక్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిమానులు గట్టిగా కోరుతున్నారు. సోషల్ మీడియాలో తరచూ ఈ రీమేక్‌పై పోస్టులు పెడుతూ వస్తున్నారు.
నాగార్జున హీరో అయిన ఎనిమిదేళ్లకు ‘హలో బ్రదర్’ చేశారు. ట్విన్స్‌గా ఆయన చూపించిన వేరియేషన్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. వాటిలో ఒకటి మాస్ క్యారెక్టర్ అయితే, మరొకటి సాఫ్ట్ రోల్. కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈవీవీ ఈ మూవీని తీర్చిదిద్దారు. అందుకే అప్పట్లో టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా ఆ సినిమా నిలిచింది. ఇప్పుడు నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటిపోయాయి. యాక్టర్‌గా ఎంతో పరిణతి సాధించాడు. మాస్, క్లాస్ క్యారెక్టర్ల మధ్య వేరియేషన్ చూపించగల నేర్పు అతడిలో పుష్కలంగా ఉంది. అందుకే ‘హలో బ్రదర్’ రీమేక్‌కు ఇదే సరైన సమయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరైతే డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. హిందీలో ‘జుడ్వా’, ‘జుడ్వా 2’ సినిమాలు రెండింటినీ డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈవీవీ సత్యనారాయణ లేరు. ఆయన స్థానంలో ఆద్యంతం నవ్వులు పంచే ఈ ఎంటర్‌టైనర్‌ను తియ్యగల సామర్థ్యం ఏ దర్శకుడిలో ఉంది?.. ఈ ప్రశ్నకు ఒక్క అనిల్ రావిపూడి మాత్రమే సమాధానంగా కనిపిస్తున్నాడు. ‘ఎఫ్ 2’ మూవీని అతను తీసిన తీరుతో, హిలేరియస్‌గా నవ్వించగల ‘హలో బ్రదర్’కు అతనైతేనే న్యాయం చేకూర్చగలడని విశ్లేషకులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున ‘హలో బ్రదర్’ను చైతన్యతో నిర్మించే ఆలోచన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆ రీమేక్ బాధ్యతను తీసుకోవడానికి అనిల్ రావిపూడికి కూడా అభ్యంతరాలేమీ ఉండకపోవచ్చు. ఏదేమైనా ‘హలో బ్రదర్’ రీమేక్‌కు ఇంతకంటే మించిన తరుణం ఉండదని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.