దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు ఎన్టీఆర్ జీవిత చరిత్రను మరోసారి తెరపైకి తీసుకురావడానికి.. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా వెబ్ సీరిస్‌గా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను క్రిష్ తెరకెక్కించగా.. ఆశించినంతగా ఆడకపోగా.. భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.. బాలయ్యకు కూడా అపకీర్తిని తెచ్చిపెట్టింది. ఆ దెబ్బ నుంచి బాలయ్య ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడని చెబుతుంటారు.
మరోవైపు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో ఎన్టీఆర్ జీవిత చరిత్రను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తెరకెక్కించాడు. అయితే ఇది మాత్రం పర్లేదనిపించింది.. కలెక్షన్లు కూడా ఆశించినంత రాకపోగా నష్టాలేమీ లేవు. అయితే.. ఇటు క్రిష్.. అటు ఆర్జీవీ ఇద్దరూ పోటీ పడి మరి తెరకెక్కించినప్పటికీ.. అది కూడా నందమూరి రక్తబంధమైన బాలయ్య నటించినప్పటికీ ఇంకా ఏదో కొరతగానే ఉందని మోహన్ బాబు భావించారో.. లేకుంటే ఇంకాస్త మంచిగా తెరకెక్కించాలని భావించారో.. లేకుంటే ఎవరికీ తెలియని విషయాలన్నీ బయటపెట్టాలని అనుకుంటున్నాడో తెలియట్లేదు కానీ.. కలెక్షన్ కింగ్ మాత్రం అన్నగారి బయోపిక్‌ను వెబ్ సీరిస్‌గా తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు.
ఈ సీరిస్‌లో.. కేవలం రాజకీయాల నేపథ్యంలో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నారట. దీనికి ‘చదరంగం’ అనే టైటిల్‌ను అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు రాజ్ అనంత దర్శకత్వం వహిస్తుండగా.. మంచు విష్ణు నిర్మించనున్నాడని టాక్ నడుస్తోంది. అయితే కథ సహకారం మాత్రం మొత్తం కలెక్షన్ కింగ్‌దేనట. ఎన్టీఆర్‌తో మోహన్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది.. మంచి ఆప్తుడు కూడా. ఇందులో ఎవరికీ తెలియని సీక్రెట్స్ చూపిస్తారట. కాగా.. ఇందులో హీరోగా సీనియర్ నటుడు శ్రీకాంత్ నటిస్తున్నాడట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన జీ 5లో కొద్దీ రోజుల్లోనే ఈ సిరీస్ ప్రసారం కానుందని సమాచారం. అయితే.. బాలయ్య నటించిన రెండు భాగాలు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లు వర్కవుట్ కాలేదు.. మరి ఈ వెబ్ సీరిస్ అయినా అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.