పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పతి వరకు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరీకి ఈ సినిమా మాంచి ఊరటనిచ్చింది. ఈ సినిమాలో రామ్ మొట్టమొదటి సారిగా పూర్తి మాస్ క్యారెక్టర్ లో కనిపించాడు. నభా నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎంతలా ఆడిందో టెలివిజన్ లోనూ అదే రేంజ్ లో తన ఊపు ప్రదర్శిస్తుంది.
ఈ మధ్య నార్త్ ఇండియా జనాలు సౌత్ సినిమాల్ని తెగ చూసేస్తున్నారు. బాలీవుడ్ లో మాస్ సినిమాలు రాకపోవడంతో అక్కడి జనాలంతా మన సినిమాల మీద పడ్డారు. మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ హిందీ డబ్బింగ్ సినిమా సోనీ మ్యాక్స్ లో వేస్తే మంచి టీఆర్పీ వచ్చిందట. అంతే కాదు ప్రస్తుతం ఈ హిందీ డబ్బింగ్ ఇస్మార్ట్ శంకర్ యూట్యూబ్ లోనూ సంచలనం రేపుతుంది. యూట్యూబ్ లో పెట్టిన రెండు రోజుల్లోనే రెండు కోట్ల మంది చూశారంటే ఈ సినిమా అక్కడి జనాలని ఎంతలా ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆదిత్య మూవీస్ వారు ఈ హిందీ డబ్బింగ్ ని యూట్యూబ్ లో పెట్టారు. దీనిలోని పాటలు, కొన్ని సన్నివేశాలని తొలగించి రెండు గంటల చిత్రంగా మలిచారు. రెండు రోజుల్లోనే రెండు కోట్ల మంది చూసిన ఈ సినిమా..మరి కొద్ది రోజుల్లోనే పదికోట్ల మందికి చేరుకుంటుంది.. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తెలుగులోనే కాదు హిందీలోనూ ఫేమస్ అయ్యాడు.