ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా ‘పోస్టర్’ సినిమా టీజర్ లాంచ్
ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఎంతో ఫేమస్. అందులో ఎన్నో సినిమాలు వంద రోజులు ఆడాయి. అలాంటి థియేటర్ లో ప్రొజెక్టర్ గా పదేళ్లు పని చేసిన టి.మహిపాల్ రెడ్డి (TMR) డైరెక్టర్ గా ‘పోస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్ నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ... ‘‘టీజర్ చూసిన తరువాత మహిపాల్ రెడ్డి ప్రతిభ ఏంటో అర్ధమైంది. తనకిదే తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని గ్రాండ్ గా తీయడం అభినందించాల్సిన విషయం. ఇక టీజర్ చూస్తుంటే ధియేటర్ నేపథ్యంలో తీసిన సినిమా అని అర్ధమవుతుంది. ప్రేక్షకులను ధియేటర్ కి రప్పించే అంశాలు మెండుగా ఉన్నాయి. ఈ టీజర్, చిత్ర టీమ్ యొక్క స్పిరిట్ చూసాక సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలుగుతుంది’’ అని అన్నారు.
దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘మా సినిమా టీజర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా విడుదల అవ్వడం చాలా ఆనందంగా ఉంది. వారికి టీజర్ నచ్చడమే మా సినిమా తొలి విజయంలా భావిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగే కథనే నేను సినిమాగా తీశాను. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ... పోస్టర్ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి.. పోస్టర్ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది సినిమా కాన్సెప్ట్. సమస్యలు అనేవి అన్నిట్లో ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లగలిగితే లైఫ్ ఎంతో బావుంటుంది. అంతే కానీ చిన్న విషయాలకే క్రుంగి పోయి ఆత్మ హత్యలు చేసుకోవద్దు అని అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం చేసాం. సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట రిలీజ్ చేసాం. మంచి రెస్పాన్స్ వస్తుంది’’ అన్నారు.
హీరో విజయ్ మాట్లాడుతూ... ‘‘నా అభిమాన హీరో అయిన వెంకటేష్ గారి బ్రదర్ సురేష్ బాబు గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. జీరో నుంచి ఒక వ్యక్తి హీరోగా ఎలా ఎదిగాడు అన్నదే మా సినిమా స్టోరీ’’ అన్నారు.
హీరోయిన్స్ రాశి సింగ్ మరియు అక్షత సోనావానేలు మాట్లాడుతూ.. ‘‘సురేష్ బాబు గారి లాంటి ఒక పెద్ద నిర్మాత చేతుల మీదుగా మా మొదటి సినిమా టీజర్ విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు.
ఇందులో శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు, జగదీశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : నివాస్, సంగీతం: శాండీ అద్దంకి, కెమెరా: రాహుల్, ఎడిటర్: మార్తాండ కె వెంకటేష్, నిర్మాతలు : టి.శేఖర్ రెడ్డి, ఏ.గంగారెడ్డి, మరియు ఐ.జి రెడ్డి. రచన–దర్శకత్వం టి.యం.ఆర్.