అవును మీరు వింటున్నది నిజమే.. రాజకీయాల్లోకి రాకముందుండే చిరంజీవి గుర్తొస్తారట. అదెలాగంటే.. ఎవరు ఏమనుకున్నా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు సినిమాల్లోనూ (ఖైదీ నం.150, సైరా) సినిమాల్లో మునుపటి చిరంజీవి కనిపించట్లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అభిమానులు, సినీ ప్రియులు మాత్రం మాకు పాత చిరంజీవే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో అచ్చం ఒకప్పటి చిరును దింపేయాలని కొరటాల శివ ఫిక్సయిపోయారట. ఇలా దింపాలంటే కావాల్సిందేంటి..? అని ఆలోచించగా.. దుమ్ముదులిపే ఫైట్స్.. నాటి డ్యాన్సులే..! ఈ రెండు కలిస్తే ఇక చిరులో పాత మెగాస్టార్‌ను మెగాభిమానులు చూసుకుంటారు.. ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదిక!.
ఒకట్రెండు నిశితంగా చిరు పాత సినిమాలు.. అనగా రాజకీయాల్లోకి రాక ముందు సినిమాలు ‘స్టాలిన్’, ‘ఠాగూర్’, ‘జై చిరంజీవ’తో పాటు పలు సినిమాలు చూసిన కొరటాల ఓ క్లారిటీకి వచ్చేశాడట. చిరంజీవితో అదిరిపోయే డ్యాన్స్ చేయించాలని ఫిక్సయ్యి, ఫైట్లు చిత్రీకరించాడట. ఇప్పటికే మూడు ఫైట్స్, ఓ పాట పూర్తిగా అయిపోయిందట. ఇప్పటి వరకూ అన్నీ మెగాస్టార్‌లోని పాత చిరును గుర్తు చేస్తాయట. ఇప్పటికే దాదాపు కీలక యాక్షన్ ఎపిసోడ్లన్నీ ముగించేసిన కొరటాల.. ఇక ఫ్లాష్ బ్యాక్‌తో పాటు నాలుగు పాటలు, ఇంకో ఫైట్ చిత్రీకరించాలట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఇప్పటి వరకూ షూటింగ్ అయిపోగా.. మిగిలినది ఎక్కడెక్కడ ఉంటుందనే విషయం మాత్రం తెలియరాలేదు.
మొత్తానికి చూస్తే.. నిజంగా ఈ విషయం మెగాభిమానులకు శుభవార్తే.. పాత చిరును మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న కొరటాలకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లోని డ్యాన్స్‌లు.. ఫైట్స్ మళ్లీ తెరపైన చూడబోతున్నారన్న మాట. వాస్తవానికి నాటి నుంచి నేటి వరకూ స్టెప్పులేయడంలో చిరు తర్వాత ఎవరైనా.. ఆయన ఇన్ని రోజులు బ్రేకులిచ్చినప్పటికీ ఎవరూ బీట్ చేయలేకపోయారు. కాగా.. ఈ సినిమాలో చిరు సరసన త్రిష రెండోసారి నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో చిరు చిన్ననాటి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు.. ఈ ‘ఆచార్య’ (ఇంకా ఫిక్స్ అవ్వలేదు) సినిమాకు నిర్మాతగా కూడా చెర్రీనే వ్యవహరిస్తున్నాడు. మరి తాజాగా వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.