టాలీవుడ్ దిగ్గజాల్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు పేరు కూడా ఉంటుంది. సి. అశ్వినీదత్, అల్లు అరవింద్ తరహాలోనే ఆయన కూడా చాలా కాలం అగ్ర నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవికి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో కె.ఎస్. రామారావు నిర్మించిన సినిమాలు ప్రధాన పాత్ర పోషించాయి. వాటిలో ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘రాక్షసుడు’, ‘మరణ మృదంగం’ సినిమాలున్నాయి. అలాగే వెంకటేశ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చంటి’, క్లాసిక్‌గా పేరుపొందిన ‘మాతృదేవోభవ’ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి సినిమా వస్తున్నదంటే, అది కచ్చితంగా బాగుంటుందనే పేరు వచ్చింది.
అలాంటి నిర్మాత ఇవాళ దివాలా తీసేశారు. అనూహ్య స్థాయిలో అతి స్వల్ప కాలంలో యూత్ ఐకాన్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో ఆయన నిర్మించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ కావడంతో ఆయన భారీగా నష్టపోయారు. ఈ సినిమాకి ముందు ఆయన సాయితేజ్ హీరోగా నిర్మించిన ‘తేజ్.. ఐ లవ్ యు’ డిజాస్టర్ కాగా, భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్‌లో నిర్మించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా ఫ్లాపయ్యింది. వాటి నష్టాలు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు తోడవడంతో ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.
‘వరల్డ్ ఫేమస్ లవర్’లో డైరెక్టర్ క్రాంతిమాధవ్ కంటే విజయ్ దేవరకొండ ఎక్కువ కష్టపడ్డాడని ఆ మూవీ ప్రి రెలీజ్ ఈవెంట్‌లో రామారావు చెప్పారు. దానర్థం చాలామందికి తెలుసు. క్రాంతిమాధవ్ స్క్రిప్టును విజయ్ చాలాచోట్ల మార్చేశాడనీ, సెట్స్‌పై పలు సన్నివేశాల్ని విజయ్ స్వయంగా పర్యవేక్షించాడనీ యూనిట్ వర్గాలు కూడా చెప్తున్న మాట. విజయ్ మితిమీరిన జోక్యం కారణంగానే ఇప్పుడు మనం థియేటర్లలో చూస్తున్న ఔట్‌పుట్ వచ్చిందనీ, అది ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదనీ ఆ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో విజయ్ ఫ్లాపుల హ్యాట్రిక్ పూర్తి చేసేశాడు.
మూడున్నర దశాబ్దాలకు పైగా ఫిల్మ్ ప్రొడక్షన్‌లో అనుభవం ఉండి కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ను ఇలా తీశారేమిటంటూ ఇవాళ కె.ఎస్. రామారావును చాలామంది నిలదీస్తున్నారు. ఆయన కూడా ఏమీ జవాబివ్వలేని స్థితిలో ఉన్నాడు. ఆ సినిమా రిలీజయ్యాక ఆయన పూర్తిగా మౌనం వహించారు. సక్సెస్ మీట్ ఏర్పాటు చెయ్యలేదు. ఆయన కానీ, హీరో హీరోయిన్లు కానీ మీడియాలో ఎలాంటి ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అంతా సైలెంట్ అయిపోయారు. మునుపటి సినిమాల అప్పులు, ఈ సినిమా నష్టాలు వెరసి కె.ఎస్. రామారావును నిండా ముంచేశాయనీ, ఆస్తులు అమ్మి కొన్ని అకౌంట్లను సెటిల్ చేశారనీ వినిపిస్తోంది. నిజంగా ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్‌కు ఇలాంటి స్థితి ఎదురవడం విచారకరం.