తెలుగులో ప్రస్తుతం రచయితలే దర్శకులుగా మారుతున్నారు. దర్శకులు తమ కథల్ని తామే రాసుకుని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒకరు రాసిన దానిని మరొకరు తెరకెక్కించే పద్దతి చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు కథారచయితలు సెపరేట్ గా ఉండేవారు. దర్శకులు కేవలం కథారచయితలు రాసిన దానికి దృశ్య రూపం ఇచ్చేవారు. అలా రచయిత, దర్శకుడికి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రచయిత, దర్శకుల మధ్య సంబంధం బాగా మెయింటైన్ చేసిన వారిలో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలు కూడా ఉన్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి తన రెండవ సినిమా అశోక్ నుండి వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అయితే రవితేజతో తీసిన కిక్ 2 సినిమా ఫ్లాప్ అవడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేధాలు వచ్చి విడిపోయారు. అలా విడిపోయాక సురేందర్ రెడ్డి వేరే రచయితలతో కలిసి ధృవ, సైరా వంటి సినిమాలు చేశాడు. అటు వక్కంతం వంశీ దర్శకత్వ ప్రయత్నాల్లో పడి అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నే సినిమా చేశాడు.
ఆ సినిమా డిజాస్టర్ కావడంతో వంశీకి మళ్ళి దర్శకుడిగా అవకాశం రాలేదు. దాంతో అప్పటి నుండి గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండి అక్కడ స్క్రిప్ట్ అనలైజర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు సురేందర్, వంశీలు మళ్ళీ ఒక్కటవుతున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రేసుగుర్రం సీక్వెల్ సినిమా కోసం వీరిద్దరు కలిసి పనిచేయాలని అనుకుంటున్నారట. సురేందర్ రెడ్డి కూడా సైరా తర్వాత మరో సినిమా ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ తో రేసుగుర్రం ౨ చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి వీరిద్దరూ స్క్రిప్టు పనుల్లో ఉన్నారని అంటున్నారు.