మాస్ సినిమాలని తనదైన శైలిలో తీసే దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం మచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల అతడు దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమా మంచి విజయం సాధించింది. అయితే దాంతో పాటు హరీష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా బాలీవుడ్ లో విజయం సాధించిన దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కింది.
ఇప్పుడు హరీష్ పవన్ తో చేసే మరో చిత్రం కూడా రీమేక్ అయ్యుంటుందని పుకార్లు వెల్లువెత్తాయి. ఆ పుకార్లని హరీష్ ఖండించాడు. ఈ పుకార్లు షికారు చేస్తుండగానే మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది. హరీష్ శంకర్ చిరంజీవిని డైరెక్ట్ చేయబొతున్నట్లు వెల్లడించాడు. ఆ వార్త వెలువడినప్పటి నుండి అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవితో చేసే సినిమా కూడా రీమేక్ అయ్యుంటుందని అంటున్నారు.
వార్తల్లో వస్తున్నట్టు మళయాలంలో సూపర్ హిట్ సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు చెబుతున్నారు. హరీష్ శంకర్ రీమేక్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ అని అందరికీ తెలుసు. మన నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేస్తూ..హీరోకి తగ్గట్టుగా సినిమాల్ని రీమేక్ చేస్తాడు. మరి అలాంటి దర్శకుడు మెగాస్టార్ తో రీమేక్ చేస్తే బాగానే ఉంటుంది. మరి ఈ వార్తలు నిజమా కాదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.