విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ఈవెంట్‌లో ఈ సినిమానే నా లాస్ట్ లవ్ స్టోరీ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. హీరోయిన్స్ పక్కలో బాంబ్ పడ్డట్టుగా ఉలిక్కి పడ్డారు. రెండు మూడు సినిమాల్లో లవర్ బాయ్‌గా కనబడిన విజయ్‌కి అప్పుడే లవ్ స్టోరీస్ మీద మొహం మొత్తేసిందా అన్నారు. మరి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితం ముందే ఊహించి అలా చెప్పాడేమో అనిపిస్తుంది. మరి నిన్న విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ చూస్తుంటే విజయ్ అలా చెప్పడానికి.. లవ్ స్టోరీస్ మీద విరక్తి పుట్టడానికి ఓ కారణమై ఉండొచ్చు అనే అనుమానం కలగక మానదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ నటనలో, స్టైలింగ్‌లో అక్కడక్కడా అర్జున్ రెడ్డి ఛాయలు కనబడ్డాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా అదే చెబుతున్నారు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుండి విజయ్ ఎప్పటికి బయటపడతాడో అని.
మరి విజయ్ కూడా ఆ హ్యాంగోవర్ నుండి బయటపడాలని ప్రయత్నంలోనే ఉండి లవ్ స్టోరీస్ వదిలేస్తున్నాడేమో. అసలు వరల్డ్ ఫేమస్ లవర్‌ని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేశాడా? లేదంటే విజయ్ డైరెక్ట్ చేశాడా? అనిపిస్తుంది. హీరో విజయ్ చేసుకున్నదే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టయిల్ ఆఫ్ డైరెక్షన్ అంతా విజయ్‌దే అని అనిపించకమానదు. ఈ సినిమాలో దర్శకుడు కథపై ఫోకస్ చేసినా కథనంపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ కథ బాగున్నా కూడా స్క్రీన్‌ప్లే మాత్రం స్లోగా సాగింది. ఎంత వద్దనుకున్నా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి ప్రభావం విజయ్ దేవరకొండపై కనిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండతో సినిమా అనగానే దర్శకులు కూడా అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయ్యి... అలాంటి కథలనే ఎక్కువగా రాస్తున్నారేమో అనిపిస్తుంది. అర్థం పర్థంలేని క్లయిమాక్స్, సాదాసీదాగా అనిపించే రెండు కథలు కలిపి, మెయిన్ లీడ్ స్టోరీకి ముడిపెట్టి తీసిన ఈ సినిమా పరమ బోరింగ్‌గా అనిపించింది.
ఇక సినిమాలో ఒక్క శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ అంటే ఇల్లేందు ఎపిసోడ్ మాత్రమే అదిరిపోయింది. సింగరేణిలో ఉండే విజయ్, ఐశ్వర్యా రాజేష్ పాత్రలపై దర్శకుడు బాగా ఫోకస్ చేసాడు.. తర్వాత కథని గాలికొదిలేసాడనిపిస్తుంది. మెయిన్ థ్రెడ్ బాగానే వుంది అనిపిస్తుంది కానీ అంతలోనే హీరో క్యారెక్టరైజేషన్ చూసి వెగటు వస్తుంది. మరి ఇలాంటి సినిమాతోనే లవ్ స్టోరీస్ కి ఎండ్ కార్డు వేసి.. మాస్ వైపు పోవాలనుకుంటున్నట్లుగా వుంది విజయ్ తరహా ఆలోచన.