డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫైటర్ అనే పేరు నిర్ణయించినప్పటికీ, మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆ పేరును తీసేసి మరో పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి లైగర్ అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక ఫైటర్ గా కనిపించబోతున్నాడు.
విజయ్ దేవరకొండ నుండి వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్ ని విజయ్ ముందే ఊహించినట్టున్నాడు. ఈ విషయం అతడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలని బట్టి అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ ఫేమస్ సినిమా మీద విజయ్ ఎక్కువ అంచనాలు పెట్టుకోలేదని అతని మాటతీరు ద్వారా అర్థమైంది.
విజయ్ అనుకున్నట్టుగానే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో తీసే సినిమాతో బిజీగా ఉన్నాడు. నిన్న ఈ సినిమా షూటింగ్ సెట్ నుండి ఒక ఫోటోని విడుదల చేశారు. అందులో పూరిజగన్నాథ్ తో పాటు ఛార్మి, విజయ్ ఇంకా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జానీ కూడా ఉన్నాడు. జానీ తయారుచేసిన ఫైటింగ్ రింగ్ వద్ద దిగిన ఈ ఫోటో ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ సినిమాని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడా లేదా చూడాలి.