త్రివిక్రమ్ డైరెక్షన్‌తో అల్లు అర్జున్ నటించిన మూడో మూవీ ‘అల.. వైకుంఠపురములో’ జనవరి 12న విడుదలై బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టవడమే కాకుండా, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్టులో స్థానం సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అద్వితీయం. తమన్ స్వరాలు కూర్చిన పాటలైతే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో చూశాం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ యు.ఎస్. బాక్సాఫీస్ దగ్గర కూడా నాన్-బాహుబలి 2 రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అది రూ 158 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యంలో ముంచేసింది.
ఈ ఆనంద సమయంలో అల్లు అర్జున్ ముంబైలో ఒక ఇంటిని కొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతను ఈ విషయమే చెప్పాడు. ‘‘నాకు ముంబై అంటే ఇష్టం. అందుకే ఇక్కడకు వస్తూ, తెలిసినవాళ్లను కలుస్తుంటాను. కానీ ముంబై సిటీలో నాకు ఇల్లు లేదు. వచ్చినప్పుడల్లా మా గీతా ఆర్ట్స్ గెస్ట్ హౌస్‌లో దిగుతుంటాను. అది నా సొంతది కాదు. ఇప్పుడు ముంబైలో ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పాడు బన్నీ. స్టైలిష్ స్టార్‌గా అభిమానులు పిలుచుకొనే అల్లు అర్జున్ బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని కూడా అనుకుంటున్నాడు. సరైన స్క్రిప్ట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయినప్పటికీ బన్నీ మాత్రం ఇంకా సెట్స్ మీదకు రాలేదు. వచ్చే వారంలో మొదలయ్యే రెండో షెడ్యూల్లో ఆయన సన్నివేశాలు మొదలవుతాయి. రష్మికా మందన్న ఇందులో హీరోయిన్.