రానా దగ్గుబాటి ముఖ్యపాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అరణ్య. హిందీలో హాథీ మేరే సాథీ గానూ, తమిళంలో కాడన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిధ్ధం అవుతోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో రానా ఒక అడవి మనిషిలాగే కనిపించాడు. అడవిని కాపాడే వ్యక్తిగా రానా లుక్ సూపర్ గా ఉంది. సినిమాలో రానా ఏనుగులను చూసుకుంటూ అడవిని కాపాడుకుంటూ బ్రతుకుతాడట..
అస్సాంలోని జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి 1300 ఎకరాల్లో అడవిని పెంచాడు. అతడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో రానా వద్ద ఫోన్ కూడా లేదట. అంతే కాదు కనీసం సహా నటులు కూడా లేకుండా ఒక్కడి మీదే చాలా రోజులు షూట్ చేశారట. అలా అడవిలో ఫోన్ లేకుండా ఒక్కడి మీదే షూట్ చేస్తుంటే జీవితం అంటే ఏంటో అర్థం అయిందని రానా అంటున్నాడు.
రానా ఏనుగులని చూసుకునే వ్యక్తిగా కనిపిస్తాడని ముందే చెప్పుకున్నాం..అయితే మొత్తం ముఫ్పై ఏనుగుల్లో ఒక లీడర్ ఏనుగు కోసం వాటికి కూడా ఆడిషన్ నిర్వహించారట. తమకు కావాల్సిన విధంగా ఉన్న ఏనుగుని ఎంచుకుని దాన్ని మిగతా ఏనుగులకి లీడర్ ని చేశారట. మొత్తానికి సినిమాల్లో నటీనటులకే కాదు ఏనుగులకి కూడా ఆడిషన్ నిర్వహించిన వారిగా చరిత్ర సృష్టించారు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు..