ప్రేమ, లవ్, కాదల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లే ఉన్నాయ్.. ప్రేమ ఇచ్చే హాయి మరి ఎందులోనూ ఉండదని లవ్‌లో పడినా వాళ్లకు మాత్రమే తెలుస్తుంది! లవ్‌లో ఉండే హ్యాపీ ఎక్కడా దొరకదు.. ఎంత వెతికినా కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఈ ప్రేమ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇంకో రకంగా చూస్తే.. ప్రేమ అనేది.. పుట్టిన ఇళ్లు, చదివిన స్కూలు, పనిచేసే చోటు ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరివల్లనైనా ప్రేమ పొందామంటే జాయ్ ఫుల్ లైఫ్ దొరికేసినట్టేనని తెలిసే ఉంటుంది. ఇదిగో ఇలాంటి అన్ని విషయాలు కలబోసిన చిత్రమే.. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. మరో నలుగురు భామలు నటించిన ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ప్రేమకు సంబంధించిన సినిమా గనుక దీన్ని ‘ప్రేమికుల రోజు’న అనగా ఫిబ్రవరి-14న రిలీజ్ చేయడం జరిగింది. అసలు సినిమా పరిస్థితేంటి..? థియేటర్లలో సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు..? మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ వీరాభిమానులు ఏమంటున్నారు..? అనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి!?
సినిమా ఫస్టాఫ్ సూపర్బ్ అనిపించినప్పటికీ సెకాండాఫ్ మాత్రం ఆశించినంతగా లేదని వీక్షకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. విజయ్ దేవరకొండ నటన, ఇల్లెందు నేపథ్యంలోని కథ, ఫస్టాఫ్ మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. సెకాండాఫ్ మాత్రం ఆశించినంతగా లేదు.. ఇదే సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాస్తవానికి సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్కవుట్ అయితే అదిరిపోతుంది.. కానీ సినిమాలో సంగీతం పండలేదు.. అంతేకాదు ప్రేమకథలకు సంగీతం బలమన్న విషయం తెలిసిందే. అయితే.. సంగీతాన్ని పండించడంలో చిత్రబృందం ఫెయిల్ అయ్యింది. ఇక కెమెరా పనితనం మాత్రం బాగా ఆకట్టుకుంది.. దీన్ని ప్లస్ పాయింట్‌లోకి వేసుకోవచ్చు.
నటన ఎలా ఉంది..!?
విజయ్ ఒక్కడే కాదు.. భావోద్వేగాలు పండించడంలో రాశీఖన్నా అదుర్స్ అనిపించింది. రొమాన్స్ సైతం ఇరగదీసేసింది. ఐశ్వర్య రాజేశ్ పాత్ర, నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ చేయలేరేమో. ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రాణం. సువర్ణగా ఐశ్వర్య రాజేష్ కూడా అదరగొట్టింది.. అయితే ఈ ఇద్దరి ఎపిసోడ్ ఉన్నంతవరకూ సినిమా ఎక్కడికో పోయింది. అయితే.. ఇంటర్వెల్ తర్వాత పారిస్ ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెడుతుందని వీక్షకులు చెబుతున్నారు. ఇక ఈజా, కేథరిన్ విషయానికొస్తే వీరిద్దరూ తక్కువసేపే కనిపించినప్పటికీ.. ఉన్నంత సేపూ ఊపేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శీనయ్య పాత్రలో విజయ్ దేవరకొండ చాలా బాగా నటించాడని చెప్పుకోవచ్చు. సింగరేణి బొగ్గు గనుల్లో ఎలా ఉంటారు..? అనేది కళ్లకు కట్టినట్లుగా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు.
ఇదీ పరిస్థితి!
చివరగా ఒక్క మాటలో.. శీనయ్య-సువర్ణ పాత్రలు మినహా.. మిగిలిన పాత్రలు ఆశించినంతగా లేవ్.. మొత్తం మీద చూస్తే.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ‘శీనయ్య కథే’ అదిరిపోయింది. శీనయ్య సింపేశాడంతే..!. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే టైటిల్ కంటే ‘శీనయ్య లవ్ స్టోరీ’ లేదా ‘శీనయ్య ప్రేమ కథ’ అనే టైటిల్ పెట్టుంటే బాగా సెట్ అయ్యేదేమో మరి.!