మాస్ స్టార్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’
‘వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ’ అని విజయ్ దేవరకొండ ఎందుకు ప్రకటించాడు?. ఇప్పుడు అతని ఫ్యాన్స్‌తో పాటు ఫిలింనగర్ జనాల్నీ తొలుస్తున్న ప్రశ్న ఇది. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ నలుగురు హీరోయిన్లతో నటించాడు. అందులో అతను మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రేమికుడిగా విజయ్ అమితంగా అలరిస్తాడని క్రాంతిమాధవ్ అంటున్నాడు. సెన్సేషనల్ ఫిల్మ్ ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ మనకు ప్రేమికుడుగానే దర్శనమిచ్చాడు. తను ప్రేమించిన యువతి మరొకరిని పెళ్లాడటంతో పిచ్చివాడైపోయి ఎలా ప్రవర్తించాడో చూసి, చలించి ఆ చిత్రానికి ఘన విజయం చేకూర్చిపెట్టారు ప్రేక్షకులు. అతని కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ అయిన ‘గీత గోవిందం’ పైకి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా కనిపించినా, అంతర్లీనంగా అందులో విజయ్ హీరోయిన్ రష్మికా మందన్నను తొలిచూపులోనే ప్రేమించి చేసిన ఒక చిన్న తప్పిదంతో ఎలా అగచాట్లు పడ్డాడనేది కనిపిస్తుంది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ అతను ప్రేమికుడే.
ఇప్పుడు ఏకంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’లా మన ముందుకు వస్తున్నాడు విజయ్. అలాంటిది హఠాత్తుగా అతను ఇదే తన చివరి లవ్ స్టోరీ అని అనౌన్స్ చెయ్యడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. అయితే అతను ఈ నిర్ణయం ఉన్నపళాన తీసుకున్నది కాదనీ, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ విజయ్ ఒక యూత్ ఐకాన్. యూత్‌లో అతనికున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. కానీ మాస్‌లోకి విజయ్ ఇంకా వెళ్లలేదు. ‘ఎ’ సెంటర్లలో ఉన్న ఫ్యాన్ బేస్ బి, సి సెంటర్లలో అతనికి లేదు. లవ్ స్టోరీస్ చేసుకుంటూ ఉంటే, తను ఎప్పటికీ మాస్ స్టార్‌గా ఎదగలేనని విజయ్ అర్థం చేసుకున్నాడు.
నేటి మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు మాస్ ఎంటర్‌టైనర్స్‌తోటే ఆ స్థాయికి ఎదిగారని గ్రహించడం వల్లే, మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ వైపు విజయ్ దృష్టిపెడుతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తొలిసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ కోసం ఫైట్స్‌లో ట్రైనింగ్ కూడా అతను తీసుకున్నాడు. మాస్ స్టార్‌గా ఎదగడానికి ఆ సినిమాను స్టెప్పింగ్ స్టోన్‌గా విజయ్ భావిస్తున్నాడు. దాని తర్వాత కూడా మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీలనే అతను ఎంచుకోనున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం. అందుకే తాత్కాలికంగానైనా లవ్ స్టోరీలకు అతను బ్రేక్ ఇవ్వనున్నాడు. మాస్ స్టార్‌గా విజయ్ ఏ మేరకు మెప్పిస్తాడో రానున్న పూరి జగన్నాథ్ సినిమా మనకు తెలియజేస్తుంది.