మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో సినిమా షూటింగ్ మాత్రం గ్రాండ్‌గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రెగ్యులర్‌గా షూటింగ్ మాత్రం కాలేదు కానీ.. సినిమాకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే.. చిరు పాత్రపై, సినిమా టైటిల్, హీరోయిన్ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆసక్తికర అనడం కంటే మెగాభిమానులు, సినీ ప్రియులకు పండుగలాంటి వార్తేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!
పుకారు పాతదే.. పాత్ర కొత్తది!
అదేమిటంటే.. చిరు-కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్లాష్ బ్యాక్‌లో అనగా.. చిరు చిన్నప్పుడు ఉండే పాత్రలో చెర్రీ కనిపించి అలరిస్తాడట. ఇద్దరూ ఒకే స్టేజ్‌పైన కనిపిస్తేనే మెగాభిమానులకు పండుగ.. అదే ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో.!. అయితే ఇది పాత పుకారే అయినప్పటికీ తాజాగా ఆయన పాత్ర కూడా లీకయ్యిందంటూ నెట్టింట్లో హడావుడి జరుగుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. ఈ సినిమాలో నక్సలైట్‌గా చెర్రీ కనిపిస్తాడట. తెరపై చరణ్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ పాత్ర మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందట. అంతేకాదండోయ్ సినిమా హైలెట్స్‌లో ఇది కూడా ఒకటంట. కాగా.. చిరు సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో చిరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ఓటమెరుగని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమా షూటింగ్‌లో చెర్రీ బిజీగా వున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పటి వరకూ 70శాతం పైనే అయిపోయింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి-08న రిలీజ్ కానుంది. అయితే ఆ లోపే చిరు-కొరటాల మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట.