రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ డిస్కో రాజా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నమోదైంది. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ రూ. 7.5 కోట్లు దాటకపోవడంతో ఆర్థికంగా ఈ సినిమా మీద ఆధారపడ్డవాళ్లంతా తీవ్రంగా నష్టపోయారు. ఉన్నత స్థాయి నిర్మాణ విలువలతో తయారైనప్పటికీ, స్టోరీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోవడంతో రవితేజ వరుసగా నాలుగో డిజాస్టర్ చవిచూడాల్సి వచ్చింది. డిస్కో రాజా కంటే ముందు శ్రీను వైట్ల డైరెక్షన్‌లో రవితేజ చేసిన అమర్ అక్బర్ ఆంటోని సైతం రూ. 6.5 కోట్లు కూడా సాధించలేక చతికిలపడింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చేసిన రాజా ది గ్రేట్ సినిమా హిట్టవడంతో మాస్ మహారాజా ట్రాక్‌లోకి వచ్చేశాడని ఆనందపడ్డ ఆయన అభిమానులు ఆ తర్వాత నుంచీ ఆయన సినిమా ఒకటి తర్వాత ఒకటిగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో నిరుత్సాహనికి గురవుతున్నారు. టచ్ చేసి చూడు సినిమా నుంచి ఆయన ఫ్లాపుల పరంపర మొదలైంది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చేసిన నేల టిక్కెట్టు గట్టెక్కిస్తుందనుకుంటే.. అది జరగలేదు. ఆ ఫ్లాపుల పరంపరను అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలు కొనసాగించాయి.
దీంతో రవితేజ మార్కెట్ తీవ్ర కుదుపుకు గురైంది. అతని గుడ్‌విల్ కూడా చాలావరకు దెబ్బతిన్నది. నిజానికి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో క్రాక్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు, ఇండస్ట్రీ వర్గాల నుంచే కాకుండా ట్రేడ్ సర్కిల్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు బయ్యర్లకు లాభాలు అందించడం, క్రాక్ టైటిల్, రవితేజ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా ఉండటంతో బయ్యర్లు ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. అయితే డిస్కో రాజా విడుదల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రాక్ విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలని వాళ్లు భావిస్తున్నారు.
ఇప్పుడు రవితేజ ఆశలన్నీ క్రాక్ మీదే ఉన్నాయి. డైరెక్టర్ గోపీచంద్ తనకు హిట్టిస్తాడనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. బలుపు తర్వాత మరోసారి ఈ సినిమాలో రవితేజ జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన లుక్‌లో ఆ ఇద్దరి జంట అలరించింది. పోలీసాఫీసర్ క్యారెక్టర్‌లో రవితేజ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తాడని క్రాక్ యూనిట్ మెంబర్స్ అంటున్నారు. ఈ సినిమా హిట్ కావడం రవితేజకు తప్పనిసరి. అంచనాలు తలకిందులైతే ఆయన కెరీర్ డోలాయమానంలో పడే అవకాశాలున్నాయి. అందుకే ఎంతో శ్రద్ధతో ఆ సినిమా చేస్తున్నాడు. ఆయన ఆశలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో మే 8న తేలుతుంది.