టాలీవుడ్‌లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెద్దన్నగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు దివంగత నేత, దర్శకుడు దాసరి నారాయణ పెద్దన్న పాత్ర పోషించారు. ఆయన మరణాంతరం ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలు వచ్చినా.. ఆపదలు వచ్చినా మొదట చిరంజీవి దగ్గరికే వెళ్తున్నారు. ఈ విషయంలో ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) గొడవలతో నిరూపితమైంది. అయితే.. రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు సినిమాలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో చిరును ఓ పదవి వరించబోతోందని వార్తలు చాలా రోజులుగా పుకార్లు వస్తున్నాయి.
తాజాగా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీతో దానిపై క్లారిటీ వచ్చేసింది. నటీనటులకు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకు.. చిరును కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా.. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
చిరుకు అలాంటివి అక్కర్లేదు!
‘చిరంజీవికి నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ చిరంజీవి స్థాయికి ఆ పదవి చాలా చిన్నది. అలాంటి చైర్మన్ పదవుల్లో ఖాళీగా ఉన్నవాళ్లే ఉంటారు. మెగాస్టార్ ఎప్పుడూ బిజిబిజీగా ఉండే వ్యక్తి. కమిటీలో ఏదైనా సమస్య వస్తే చిరుపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఇలాంటివన్నీ చిరుకు అక్కర్లేదు.. ఆయన సుప్రీం.. ఏదైనా సరే చేయగలిగే స్థాయిలో చిరు ఉన్నారు’ అని తమ్మారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. చిరుకు నిజంగానే ఆ పదవి ఇస్తారన్న విషయంలో నిజమెంతుందో..? చిరు ఆ పదవిని స్వీకరిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.