టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్‌లో ఉండగా ఓ పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. అయితే అదే దాదాపు ఫస్ట్ లుక్ అని ఫ్యాన్స్ అనుకున్నారు.. పెద్ద ఎత్తున షేర్‌ల వర్షం కురిపించారు. అయితే అది లీక్ అయిన ఫొటో అని ఆ తర్వాత తెలిసింది. తాజాగా పవన్ లుక్ రివీల్ అయిపోయింది.
వివరాల్లోకెళితే.. ఇటు రాజకీయాలు.. అటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా జనసేనాని గడుపుతున్న ఆయన ఇవాళ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. ఆయన్ను చూసిన వీరాభిమానులు, కార్యకర్తలు, నేతలు ఫిదా అయిపోయారు. ఇదేంటి పవన్‌లో సడన్‌గా ఇంత మార్పు అని ఆరాతీయగా.. తీరా చూస్తే అది సినిమా లుక్ అని తేలిందట. ఒకప్పుడు గుబురు గెడ్డం, ఒత్తైన జుట్టు, మీసాలతో కనిపించిన పవన్ ఇప్పుడు సరికొత్త లుక్‌లో దర్శనమివ్వడంతో రీమేక్ మూవీ లుక్ వచ్చేసిందహో అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు.
కాగా.. రెండేళ్ల తర్వాత మేకప్ వేసుకున్న పవన్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజిబిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాకు ‘లాయర్‌సాబ్’, ‘వకీల్ సాబ్’ అనే రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రీమేక్‌లో పవన్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను వేసవికి థియేటర్లలోకి తీసుకొచ్చి ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా అనంతరం క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.