Advertisementt

ప్రభాస్ అంచనాలను అందుకుంటాడా?

Wed 05th Feb 2020 07:13 PM
intersting news,prabhas movie,bahubali,jaan  ప్రభాస్ అంచనాలను అందుకుంటాడా?
Intersting News About Prabhas Movie ప్రభాస్ అంచనాలను అందుకుంటాడా?
Advertisement

రెండు ‘బాహుబలి’ సినిమాలు తెచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ తెలుగులో ఆశించిన రీతిలో వసూళ్లు తేకపోయినా, నార్త్ బెల్టులో సూపర్ హిట్టయింది. దాంతో నేటి ఏకైక పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఒక తెలుగు హీరో ఈ స్థాయి ఇమేజ్ తెచ్చుకోవడం ఇదే తొలిసారి. ఇదివరకు తమిళ స్టార్లయిన రజనీకాంత్, కమల్ హాసన్ బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశారు కానీ, వాళ్లు పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకోలేకపోయారు. మన మెగాస్టార్‌కు సైతం అది సాధ్యం కాలేదనేది వాస్తవం.

కానీ రాజమౌళి పుణ్యమా అని ‘బాహుబలి, ‘బాహుబలి 2’ సినిమాలు ప్రభాస్ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తు నిలిపాయి. ‘సాహో’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో, ఉత్తర భారత ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ సినిమాని బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో చూసేందుకు జనం ఎగబడటం చూస్తే, అక్కడి మాస్ ఆడియెన్స్‌లో ప్రభాస్ ఎంతటి అభిమానాన్ని పొందాడో ఊహించుకోవచ్చు.

ఏ హీరోకైనా కనీ వినీ ఎరుగని ఇమేజ్ వచ్చిందంటే, ఆ తర్వాత అతనిపై ఉండే ఒత్తిడి అసాధారణం. ప్రేక్షకుల అంచనాలు అంబరాన్నంటుతాయి. వాటిని అందుకోవడం కష్టమైపోతుంది. గతంలో చాలామంది హీరోల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో అయితే అలాంటి మహా అంచనాలు నెలకొంటున్నాయి. అతడిప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన హీరో కాదు. దేశంలోని అనేక భాషల అభిమాన నటుడు. గతంలో ఏ తెలుగు నటుడికీ దక్కని అరుదైన గౌరవం ఇది. ఆ బరువు బాధ్యతల్ని మోస్తూ ప్రభాస్ ఇప్పుడు ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. అదిప్పుడు మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో విడుదల చేసే లక్ష్యంతో చక్కని లవ్ స్టోరీతో, చాలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణా మూవీస్‌తో కలిసి యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తొలి సినిమా ‘జిల్’తో ఆకట్టుకున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని హై స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నాడు.

18 ఏళ్ల కెరీర్‌లో ప్రభాస్ చేసింది 19 సినిమాలే. అంటే ఏడాదికి సగటున ఒక్క సినిమానే. 2002 నుంచి 2013 వరకు పన్నెండేళ్ల కాలంలో 16 సినిమాలు చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఆరేళ్లలో చేసింది మూడు సినిమాలే. అవి.. ‘బాహుబలి: ద బిగినింగ్’, ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’, ‘సాహో’. ఇప్పుడు చేస్తోన్న ‘జాన్’ ప్రొడక్షన్‌ను కొన్ని నెలల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె హవా నడుస్తోంది. ప్రభాస్, పూజా జోడీ స్క్రీన్‌పై కన్నులపండుగగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ‘రెబెల్’ మూవీ తర్వాత మరోసారి ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు నటిస్తున్నారు. సినిమాలో తనది ప్రభాస్‌కి తండ్రి పాత్ర కాదనీ, కథకు కీలకమైన క్యారెక్టర్ అనీ ఆయన చెప్పారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇంకా ప్రకటించలేదు. కృష్ణంరాజు చెప్పినదాని ప్రకారమైతే 2020 డిసెంబర్‌లో కానీ, 2021 మొదట్లో కానీ రిలీజవుతుంది. ఇంతకీ ‘పాన్ ఇండియా సూపర్ స్టార్’ ఇమేజ్ బరువును తట్టుకొని ‘జాన్’ ప్రభాస్ నిలబడతాడా?.

Intersting News About Prabhas Movie:

Intersting News About Prabhas Movie  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement