పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పినప్పటి నుండి రోజుకో వార్త వస్తూనే ఉంది. అయితే ప్రస్తుతానికి పవన్ ఈ ఏడాది నాలుగు సినిమాలని ప్రకటించాడు. అందులో ఒక సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అదే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న లాయర్ సాబ్. టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రస్తుతానికి అలానే పిలుస్తున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ తనకి వీలు చిక్కినప్పుడల్ల హాజరు అవుతున్నాడు. అందుకోసం పవన్ కి ప్రత్యేక విమానాన్ని కూడా కేటాయించాడట దిల్ రాజు. అన్ని సౌకర్యాలు రూపొందించి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా దిల్ రాజు ఎంత సంపాదిస్తాడనే ఆలోచన ప్రతీ ఒక్కరికీ వచ్చింది. అయితే దీనికి సంబంధించి దిల్ రాజు లెక్కలు వేరుగా ఉన్నాయి. లాయర్ సాబ్ సినిమా బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమాకి రీమేక్.
ఈ సినిమా ఎక్కువ భాగం కోర్ట్ హాల్ లోనే నడుస్తుంది. కనుక ప్రొడక్షన్ పరంగా ఎక్కువ ఖర్చు ఉండదు. పవన్ కి ఇచ్చే యాభై కోట్ల రెమ్యునరేష్ పోనూ ఇరవై ఐదు కోట్లలో సినిమాని తీసేస్తున్నారు. అపుడు సినిమా మొత్తం బడ్జెట్ ౭౫ కోట్లు అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేట్రికల్ బిజినెస్ ఎంత లేదన్నా వంద కోట్ల వరకి అవుతుంది. ఇక సినిమా బాగుంటే లాభం మరింత పెరుగుతుంది. అంటే ఎటు లేదన్నా దిల్ రాజుకి ఇరవై ఐదు కోట్ల వరకి లాభం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే పవన్ తో సినిమా తీస్తున్నాడని అంటున్నారు.