విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తమిళ చిత్రమైన అసురన్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాని వెంకటేష్ హీరోగా సురేష్ బాబు తెరకెక్కిస్తున్నాడని తెలియగానే, ఆ సినిమా వెంకటేష్ కి సూట్ అవ్వదని అనేశారు. అయితే ఒక్కసారి "నారప్ప" అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రాగానే అందరి నోళ్ళు మూతబడ్డాయి.
ఫస్ట్ లుక్ లో వెంకటేష్ ని చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. నారప్పగా వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండి ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఇప్పటి వరకు ఏ సినిమాను చేయలేదు. అలాంటిది శ్రీకాంత్ అడ్డాలని నమ్మి సినిమాని ఎందుకు అప్పగించాడు అనే ప్రశ్న అందరిలో కలిగింది. అయితే ఇలా కావడానికి సురేష్ బాబుకి తన లెక్కలు తనకి ఉన్నాయట.
నారప్ప సినిమాని ఒక హిట్ దర్శకుడితో చేయిస్తే అది తనకు నచ్చిన విధంగా తీసుకుంటాడని, అలాగే హిట్ దర్శకుడి రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఉంటుందని, అంత భరించడం అనవసరం అని భావించి ఫ్లాపుల్లో ఉన్న శ్రీకాంత్ అడ్డాలకి ఛాన్స్ ఇచ్చాడట.ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడితో సినిమాని నిర్మాతకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు..అలాగే ఫ్లాప్ దర్శకుడు హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మరింత బాగా కష్టపడతాడు.. ఈ లెక్కలు అన్నీ వేసుకున్న తర్వాతే సురేష్ బాబు శ్రీకాంత్ అడ్డాలని తీసుకున్నారట.