అవును మీరు వింటున్నది నిజమే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘మూడు’ కాదు.. ఐదు చిత్రాలకు ఫిక్స్ అయ్యారట. ఇదేంటి మూడే కదా..? మిగిలిన రెండు ఎక్కడ్నుంచి వచ్చాయ్..? ఇంతకీ ఆ నాలుగో డైరెక్టర్ ఎవరు..? ఐదో డైరెక్టర్ ఎవరు..? అనే విషయాలు నిశితంగా www.cinejosh.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఇక ఆలస్యమెందుకు చదివేయండి మరి.
లెక్క తేలింది!
అప్పుడుప్పుడో టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు ఈ ‘పింక్’ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 15 తారీఖల్లా పవన్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుంది. సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి లుక్స్, టైటిల్ రాకపోగా పుకార్లు, లీకులు మాత్రమే ఎక్కువగానే వస్తున్నాయి. మొన్నటికి మొన్న పవన్ లుక్ లీకవ్వగా.. తాజాగా పవన్ డైలాగ్ చెబుతున్నట్లున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రెండు, మూడు సంగతి ఇదీ..!
ఇక రెండో సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన క్రిష్ కూడా పవన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అనధికారికంగా హైదరాబాద్‌లో షూటింగ్ కూడా ప్రారంభం అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’ను మించిన సినిమా ఇదని.. పవన్ స్వాతంత్ర్య సమరయోధుడిలా కనిపించబోతున్నారని లీకులు వస్తున్నాయ్!. హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ కూడా వేశారని తెలుస్తోంది. ఇక మూడో సినిమా విషయానికొస్తే.. హీరశ్ శంకర్-పవన్ కాంబోలో సినిమా చేస్తున్నట్లు మైత్రీ మూవీస్ అధికారికంగానే ప్రకటించేసింది.
నాలుగు, ఐదు సంగతి ఇలా..!
మూడు సినిమాల సంగతి అటుంచితే.. నాలుగైదు మాత్రం చాలా ఫ్రిస్టేజ్‌కు సంబంధించిన సినిమాలట. ఈ రెండు చిత్రాలు కూడా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఉంటాయని తెలుస్తోంది. ఈ పతాకంపై తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాగా.. మరొకరు పూరీ జగన్నాథ్ అని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఉంటాయన్నది నిజమని తెలిస్తే.. కాస్త అటు ఇటు పూర్తిగా అయిపోవాలంటే రెండు నుంచి రెండున్నరేళ్లు సమయం పడుతుందన్న మాట. అంటే దాదాపు వచ్చే ఎన్నికల సంవత్సరం పవన్ సినిమాలతోనే బిజిబిజీగా ఉంటారన్న మాట.