సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ హంగులు జోడించి చెప్పటంలో మురగదాస్ దిట్ట అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ ఈయనకు పెద్దగా అచ్చి రాలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ‘నాకెవ్వరూ అడ్డులేరు.. నాకు నేనే పోటీ’ అన్నట్లుగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు డిఫరెంట్ కథలతో అభిమానులు, సినీ ప్రియుల ముందుకొచ్చిన మురగ.. ఈ ఏడాది సంక్రాంతికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ‘దర్బార్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేశాడు. అయితే ఇదే ఊపులో స్టార్ హీరోలైన సూర్య, అజిత్‌లతో సినిమాలు చేస్తున్నాడని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.
తెలుగులో అప్పుడెప్పుడో ‘స్టాలిన్’ సినిమాతో హిట్ కొట్టిన మురుగ.. ఆ తర్వాత సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ‘స్పైడర్’ తెరకెక్కించి అట్టర్ ప్లాప్ అయ్యారు. అయినప్పటికీ మహేశ్ మాత్రం తనను బాగా ఆదరిస్తారని.. ఆయన చాలా మంచి వ్యక్తని కచ్చితంగా మహేశ్‌కు హిట్టిస్తానని ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాటిచ్చారు. ఆ సినిమా సంగతేమో తెలియదు కానీ.. తాజాగా మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా పక్కాగా ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అంటే బన్నీ 21వ సినిమా మురుగతో అన్న మాట. ఈ ఇద్దరిలో కాంబోలో వస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి స్టోరీ, లొకేషన్‌ల గురించి కూడా చర్చించారట.
‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే మురుగపై బన్నీ ప్రశంసల వర్షం కురిపించడంతో సీన్ అందరికీ అర్థమైపోయింది. అయితే ఈ సినిమా ఏ మేరకు పట్టాలెక్కుతుందో..? మహేశ్ అభిమానులను మెప్పించలేకపోయినా మురుగ.. బన్నీ వీరాభిమానులను అయినా మెప్పిస్తాడా..? లేదా అనేది తెలియాలంటే సినిమా కన్ఫామ్ అయ్యి.. అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.