జైలుకెళ్లొస్తే నిజంగానే సినిమాలు చేయకుడదా..? అలా సినిమాలు చేయకూడదని ఎక్కడైనా నిబంధనలు ఉన్నాయా..? ఒక వేళ ఉంటే ఇప్పటి వరకూ పలువురు నటీనటులు సినిమాలు ఎందుకు తీసినట్లు..? టాలీవుడ్‌లో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. యాంకర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు టాప్‌లో ఉన్న ప్రదీప్ మాచురాజు హీరోగా వస్తున్నాడు. అయితే ఆయన సినిమాల్లో ఎలా నటిస్తారంటూ ఓ కుర్ర దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు..? ఇంతకీ ఏం జరిగింది..? ఆయన పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కినట్లు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలు సంగతి ఇదీ!
యాంకర్ ప్రదీప్‌పై మేడ్చల్‌కు చెందిన శ్రీ రామోజు సునిశిత్ అనే కుర్ర దర్శకుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే.. ఓ యువతిని వేధించిన కేసులో ప్రదీప్ రెండ్రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చాడని.. అలాంటి వారితో సినిమా ఎలా తీస్తారు..? ఇదంతా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకమని ఆ కుర్ర దర్శకుడు ఆరోపిస్తున్నాడు. అందుకే ఆయన హీరోగా నటిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం షూటింగ్‌ను మొదట అడ్డుకుని.. ప్రదీప్‌పై కేసు నమోదు చేసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు ఎఫ్ఐఆర్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇది ఎంతవరకు నిజం!?
అయితే నిజంగానే కేసులు ఉన్న వాళ్లు.. జైలుకు వెళ్లొచ్చిన వాళ్లు సినిమాలు చేయకూడదా..? మరి హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద పెద్ద టాప్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు జైలుకెళ్లొచ్చి ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉండట్లేదా..? వారి సంగతేంటి..? అలాంటి వాళ్లతో పోల్చుకుంటే ప్రదీప్ కేసు ఎంత..? సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ చాలా వరకు ఏదో ఒక చిన్నపాటి కేసులుంటాయ్.. దాన్ని పట్టుకుని మరీ ఇంతలా లాగి రచ్చ చేయడమేంటి..? అని ప్రదీప్ ఫ్యాన్స్.. ఆ కుర్ర దర్శకుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతవరకూ స్పందించని ప్రదీప్.. ఎలా రియాక్ట్ అవుతాడో.. మరీ ముఖ్యంగా పోలీసులు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.