విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేమికుల రోజున మన ముందుకు వస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. కేథరిన్ ట్రెసా, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న చిత్రం కావడంతో దీని మీద బాగా ఆశలు పెట్టుకున్నాడు.
అయితే ప్రస్తుతం ఈ సినిమాకి ఓ సమస్య ఏర్పడింది. సాధారణంగా చిన్న సినిమాలకి థియేటర్ల కొరత ఏర్పడుతుంది. పెద్ద సినిమాలు విడుదల అయినపుడు థియేటర్లన్ని ఆ సినిమాలతో నిండిపోతాయి కాబట్టి చిన్న సినిమాలు థియేటర్లు దొరకవు. కానీ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కి కూడా థియేటర్లు దొరకట్లేదట. విజయ్ చిన్న హీరో కాదు. అతని గత చిత్రాలు ఎంతగా బిజినెస్ చేసాయో అందరికీ తెలిసిందే.
అయితే మరి థియేటర్లు ఎందుకు దొరకట్లేదని ఆలోచిస్తే ఒక విషయం బయటపడింది. ఫిబ్రవరి ఏడవ తేదీన సమంత నటించిన "జాను" సినిమా విడుదల అవుతుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో ఆక్యుపై చేయడంతో విజయ్ సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడింది. విజయ్ లాంటి హీరోకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మరి చిన్న హీరోల పరిస్థితి ఇంకెలా ఉంటుందో?