టాలీవుడ్‌లో మెగా హీరోలకు ఉండే క్రేజ్ వేరు.. ఇండస్ట్రీని క్రికెట్ టీమ్‌లాగా వాళ్లే దున్నేస్తున్నారు. వారిని ఆదరించే అభిమానులు అలాంటి వాళ్లు ఉన్నారు గనుక ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మెగా హీరోలకు సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా సూపర్ డూపర్ హిట్టవ్వాల్సిందే. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి వల్ల వచ్చిన క్రేజే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అందరూ మెగాభిమానులు.. మెగాభిమానులు అంటుండే వారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ పెరిగిపోవడంతో ఆయనకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటూ వస్తున్నారు. మొత్తమ్మీద మెగాభిమానులే.. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
మద్దతు విషయంలో..!
మెగాభిమానులు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ అని కొందరు.. ఇంకొందరు పవర్‌స్టార్ ఫ్యాన్స్.. మరికొందరైతే మెగాభిమానులే అని అలా కొనసాగుతున్నారు. అయితే జనసేన పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ జరగకూడని పరిణామాలు జరిగిపోయాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య.. నవ్యాంధ్రకు మూడు రాజధానులు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా దాన్ని మెగాస్టార్ మద్దతివ్వడం.. పవన్ వ్యతిరేకించడంతో మెగా వర్సెస్ పవర్ ఫ్యాన్స్‌గా పరిస్థితులు మారిపోయాయి.
అప్పుడు.. ఇప్పుడు..!
అంతేకాదు.. అప్పట్లో మెగాస్టార్ ‘ప్రజారాజ్యం’ను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో పార్టీని అమ్మేశారని.. ఇలాంటి వాళ్లకు రాజకీయాలు అవసరమా..? అంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో.. పరిణామాలు మరింత మారిపోయాయి. జనసేనను ప్రస్తుతానికి పొత్తు అంతేనని.. నిదానంగా అమ్మేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. దీన్ని కొందరు మెగా ఫ్యాన్స్ సమర్థిస్తుండగా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం కౌంటర్లు కురిపిస్తున్నారు. ఇలా పలు విషయాల్లో పవన్ వర్సెస్ చిరు వీరాభిమానులుగా విడిపోయిన తిట్టిపోసుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. పవన్ ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ మధ్య వేరుకుంపట్లు పెట్టేసుకున్నారు.
స్టైలిష్ స్టార్ ఇలా..!?
మరోవైపు ఇప్పటికే.. మెగా ఫ్యాన్స్ అనే పేరును చెరిపేసుకుని సొంత బ్రాండ్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తహతహలాడుతున్నాడు. అంతేకాదు.. తన సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో కూడా మెగాభిమానులు అనే మాట మరిచిపోయి.. సొంత అభిమానులు అనే మాటతో సరిపెట్టుకుంటూ వస్తున్నాడు. ఇలా మొత్తం మెగాస్టార్, పవర్‌స్టార్, స్టైలిష్ స్టార్.. మూడు వర్గాలుగా విడిపోయిన వీరాభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కానిపరిస్థితి..!