ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో తీస్తే సేమ్ రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. చాలా సినిమాలు పర భాషల్లో హిట్ అయ్యి వాటి రీమేక్ లు మాత్రం దారుణంగా ఫెయిలయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదీ గాక క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న సినిమాల రీమేక్ లు చేయడం మరీ కష్టం. ఏమాత్రం ఇటూ అటూ అయినా సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాంటి రిస్క్ ఉంటుందని ముందే తెలిసినా రీమేక్ చేయడానికి ముందుకు రావడం సాహసమే.
అలాంటి సాహసాన్ని టాలీవుడ్ టాప్ మోస్ట్ నిర్మాత దిల్ రాజు చేశాడు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యి క్లాసిక్ గా మిగిలిపోయిన 96 మూవీని తెలుగులో "జాను" అనే పేరుతో రీమేక్ చేశాడు. దిల్ రాజు తమిళంలో ఈ సినిమాని రిలీజ్ కంటే నెలరోజుల ముందే చూశాడట . సినిమా చూశాక దీన్ని ఖచ్చితంగా తెలుగులో రీమేక్ చేయాలని భావించాడట. సినిమా చూసినపుడు తాను ఏ అనుభూతినైతే అనుభవించాడో ఆ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకి అందించడం కోసమే "జాను" తీశానని అంటున్నాడు.
అంతా ఓకే కానీ, 96 సినిమాని తెలుగువాళ్ళు చాలా మంది చూశేసారు. అందులో ఉన్న పాత్రలకి బాగా కనెక్ట్ అయిపోయారు కూడా. ఇప్పుడు అవే పాత్రలు వేరే నటులతో చూడాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతారనేదే ప్రశ్న. సాధారణంగా రీమేక్ వెర్షన్ లలో మార్పులు చేస్తుంటారు. కానీ "జాను" సినిమాలో మార్పులు చేయడానికి ఏమీ లేవు. అలా చేస్తే సినిమా సోల్ దెబ్బతింటుంది. మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా దించితే, ఆ పాత్రలని ఆల్రెడీ చూసినవాళ్ళు కనెక్ట్ అవుతారా అన్నది సందేహం.
ఇప్పటి వరకు రిలీజైన పాటలకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా విడుదల అయ్యాక ఏమవుతుందో చూడాలి.