ప్రతీ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే చేస్తారు. తాము చేసిన ప్రతి సినిమా అందరికీ నచ్చుతుందనే అనుకుంటారు. కానీ అన్ని సినిమాలు ప్రేక్షకులకి నచ్చవు. ప్రేక్షకులకి నచ్చిన సినిమాలే బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. ప్రతీ సినిమాని మాత్రం ఎంతో శ్రమించి, హిట్ అవుతుందన్న నమ్మకంతోనే తీస్తారు. హిట్ అవదని తెలిస్తే అసలు అటు సైడు కూడా వెళ్ళరు. కానీ యువ కథానాయకుడు మాత్రం దీనికి భిన్నంగా చెప్తున్నాడు.
నాగశౌర్య "ఛలో" సినిమాతో తన స్వంత నిర్మాణ సంస్థని మొదలు పెట్టాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పేరుతో పెట్టిన ఈ బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా ఛలో మంచి విజయం సాధించింది. దాంతో నర్తనశాల అనే సినిమా కూడా తీశాడు. నర్తనశాల బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే నర్తనశాల సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించారట. అందుకే ఆ సినిమా ఫంక్షన్ లో సినిమా నచ్చక పోతే ముగ్గురికి చెప్పండి అంటూ అన్నానని చెప్పాడు శౌర్య.
తాము సినిమా చేస్తే ఇదేం సినిమారా బాబూ అని ఎవరూ అనుకోకూడదట. అలా అనుకున్నప్పుడు మనం సినిమాలు తీయడం అనవసరం అంటున్నాడు. మరి పోతుందని ముందే తెలిసినా ఎందుకూ తీసారని అడగగా, నర్తనశాల డైరెక్టర్ కి ఇచ్చిన మాటవల్లే సినిమా పూర్తి చేశానని, నా దృష్టిలో మాట నిలబెట్టుకోకుంటే చచ్చిపోయినట్టేనని చెప్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య కథ రాసి, నటించిన "అశ్వద్ధామ" చిత్రం జనవరి 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశ్వద్ధామ సినిమా విజయం పట్ల నాగశౌర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వారు అనుకున్నట్లుగా సినిమా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.