ఇండియన్ తెర మీద బాహుబలి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ కనివినీ ఎరగని రీతిలో తెరకెక్కిన బాహుబలి చిత్రం భారతీయ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసింది. అప్పటి వరకూ తెలుగు సినిమాకి ఉన్న ప్రతిష్టని మరింత పెంచి శిఖరాగ్రాన నిలబెట్టింది. ప్రపంచ సినిమాని తెలుగు సినిమా వైపుకు చూసేలా చేసిన చిత్రమిది. తెలుగు సినిమా ఇంతటి వసూళ్ళు సాధించగలదా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది.
అయితే ఇంతటి విజయానికి ముఖ్య కారకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆ తర్వాత ఆ స్థానం ప్రభాస్ కి ఇవ్వాలి. బాహుబలి సినిమా చూపించిన దారిలో వెళ్దామని ఎన్నో సినిమాలు ప్రయత్నించాయి. కానీ ఏ సినిమా వాళ్ళు కూడా ఇది బాహుబలి వల్లే సాధ్యమైందని చెప్పలేదు. చిరంజీవి తన సైరా విషయంలో మాత్రం తాను సైరా ఒప్పుకోవడానికి బాహుబలినే ప్రేరణ అని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ లిస్ట్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. అల వైకుంఠపురములో చిత్రం ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ సాధించింది. ఈ విషయమై అల్లు అర్జున్ మాట్లాడుతూ, ప్రభాస్ సినిమా పక్కన నా సినిమా చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇంకా ప్రభాస్ ని పొగుడుతూ, ఒక సినిమా కోసం ఐదేళ్ళు పనిచేయడం చాలా కష్టమని, ఈ ఐదేళ్లలో ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే షూట్ చేశారని, మిగతా మూడున్నర సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని, ఐదేళ్లలో తాను అనుకుంటే ఎన్నో సినిమాలు చేసేవాడని, కానీ అవన్నీ కాదని బాహుబలినే నమ్ముకున్నాడని, అందుకే అంతటి సక్సెస్ వచ్చిందని తెలిపాడు.