2019 ఎన్నికలకు ముందు టాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు నుంచి కూడా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు పార్టీకి సేవలు అందజేశారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ యాక్టర్స్ కమ్ లీడర్స్‌లో పలువురికి జగన్ కీలక బాధ్యతలు కూడా కట్టబెట్టారు. అయితే.. ఆ పదవులను కొందరు కాపాడుకోలేక రాజీనామా చేశారు.. అవన్నీ ఇప్పుడు అసందర్భం.!
అదృష్టాన్ని పరీక్షించుకోవాలని..!
అయితే ఎన్నికలన్నీ అయిపోయాయ్.. ఇప్పుడు కూడా మరికొందరు నటీనటులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారట. వారిలో ముఖ్యంగా టాలీవుడ్‌లో నాటి స్టార్ హీరోల్లో ఒకరైన సుమన్.. కండువా కప్పుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట. సినిమాల్లో తన నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఒకానొక దశలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అయితే ఇక రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
కండువా కప్పుకునేదెప్పుడో!
వాస్తవానికి ఈయన రాజకీయాల్లోకి రావాలని 2018 నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పట్లోనే టీఆర్ఎస్ లేదా వైసీపీలో చేరతారని వార్తలు కూడా వచ్చాయ్. తాజాగా.. వైసీపీలో చేరాలని నిర్ణయించారట. ఇందులో భాగంగానే ఇప్పటికే నాలుగైదు సార్లు వైఎస్ జగన్ అపాయిట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఇవ్వట్లేదట. ఈసారి మాత్రం యాక్టర్స్ కమ్ వైసీపీ లీడర్స్ అయిన కొందరు తన అత్యంత సన్నిహితుల సాయంతో వైఎస్ జగన్‌ను కలిసి కండువా కోనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఏపీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సరికొత్త నూతన ఆలోచనలో ముందుకు వెళ్తున్నారని ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు.. అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ.. గతంలో ఏ సీఎం చేయలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సమన్యాయం చేస్తున్నారని సుమన్ అభినందించారు.